ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ః రేవంత్ రెడ్డి
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే మాజీ సీఎం కేసీఆర్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో సీనియర్ నేత జీవన్ రెడ్డి అలకబూనిన విషయం తెలిసిందే. దాంతో ఆయన్ను బుజ్జగిస్తున్నారు. ఢిల్లీ అధిష్టానంతో చర్చల తర్వాత ఆయన వెనక్కు తగ్గారు.
ఇక ఢిల్లీలో ఆయన నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డికి సరైన ప్రాధాన్యత, గౌరవం ఇస్తామన్నారు.
కాంగ్రెస్‌కి నష్టం జరగాలని కోరుకునే గుంటనక్కలకు జీవన్‌రెడ్డి అవకాశం ఇవ్వలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని.. దాన్ని నిలబెట్టుకుంటామన్నారు. తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్.. అని.. రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.