ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో భద్రతపై పోలీసుల తనిఖీ
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో భద్రతపై పోలీసుల తనిఖీ
విశ్వంభర, భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో భద్రతపై జిల్లా పోలీసులు తనిఖీ నిర్వహించారు. బ్యాంకుల్లో భద్రతా లోపాలు ఉండకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ అన్నారు. బ్యాంకుల్లో దొంగతనాల నివారణకు, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా పరిధిలోని ఎస్ ఐ లు, సీ ఐ లు, డీఎస్పీలు ఏక కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో మరియు ఏటీఎం ల వద్ద భద్రతా పరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే ఘనపురం మండల కేంద్రంలోని డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీసీ టీవీ కెమెరాలు జిల్లాలోని అన్ని బ్యాంకులు భద్రత ప్రయోజనాల కోసం కలిగి ఉండాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న జాతీయ, ప్రైవేట్ బ్యాంకు శాఖలలో పోలీసులు జరిపిన తనిఖీల్లో గుర్తించన విషయాలపై భద్రతాపరంగా తగిన చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులకు సూచించారు. బ్యాంకు ఆవరణ అంతా కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్, సెక్యూరిటీ గార్డ్, సీసీ కెమెరాలు, లైటింగ్, బ్యాంకుల్లో భద్రత లోపాలు ఉండకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ తనిఖీల్లో భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు జిల్లా పరిధిలోని సీఐలు, ఎస్ ఐ లు పాల్గొన్నారు.