రాయపూడి భవాని భూమికి వేసిన ఇనుప కంచె వివాదం
సహాయం చేయడమే తప్ప ఇతరుల ఆస్తులను కోరుకోను.. !
విశ్వంభర, నల్లగొండ జిల్లా : మిర్యాలగూడలో రెవిన్యూ అధికారులు రాయపూడి భవాని భూమికి వేసిన ఇనుప కంచె వివాదం మరింత ముదురుతుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహరీ గోడ గేటు నిర్మించారన్న కారణంతో వాటిని ధ్వంసం చేసిన అధికారులు హెచ్చరిక బోర్డు ఇనుప కంచె పాతడాన్ని ఆర్యవైశ్య మహిళా విభాగం ఆర్యవైశ్య మహాసభ ఖండించాయి. భూమి బాధితురాలు రాయపూడి భవాని కుటుంబానికి అండగా నిలిచాయి. ఆయా సంఘాల ప్రతినిధులు రాయపూడి భవాని కుటుంబంతో కలిసి భూమిని పరిశీలించారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు ఉప్పల శారద, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరైంది కాదని భూమి మీదకి పోకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ఆర్యవైశ్యులను చులకనగా చూడటమే అన్నారు. ఆర్యవైశ్యులు సమాజ సేవకు పెట్టింది పేరని ఒకరికి సహాయం చేయడమే తప్ప ఇతరుల ఆస్తులను కోరుకోని వారిని చెప్పారు. భవాని విషయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష గానే భావిస్తున్నామన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లు చేసే వారిని ఇల్లు కట్టుకునే వారిని వదిలిపెట్టి మూడు అడుగులు ముందుకు వచ్చినందుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు ధ్వంసరచనకు పాల్పడ్డారన్నారు. చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం సబబు కాదని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హెచ్చరిక బోర్డును ఇనుప కంచెను తొలగించాలని డిమాండ్ చేశారు.