అందెల శ్రీరాములు యాదవ్ ను కలిసిన ఫోర్త్ సిటీ భూ బాధిత రైతులు
* ఫోర్త్ సిటీ రోడ్డు నిర్మాణం కొరకు తమ భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పిన రైతులు
* రైతులకు ఇష్టం లేకుండా ప్రభుత్వం ముందడుగు వేయకూడదు
* రైతులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది
విశ్వంభర, మహేశ్వరం: కందుకూరు మండలంలోని ఫ్యూచర్ సిటీ కొరకు వేయబోతున్నటువంటి 300 ఫీట్ల రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులు బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ని నియోజకవర్గ కార్యాలయంలో కలిసి వారి ఆవేదన తెలిపారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులు శ్రీరాములు తో మాట్లాడుతూ తమ భూములు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇవ్వబోమని దాదాపుగా 1900 కుటుంబాలు తమ భూమిని కోల్పోతున్నారని అందులో అందరూ కూడా చిన్న సన్న కారు రైతులని పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడే కుటుంబాలని, ఇట్టి రోడ్డు కోసం తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే తామంతా రోడ్డున పడతామని, తమ భూమి కోసం ఎంతవరకైనా పోరాడుతామని స్పష్టం చేశారు. రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ అండగా నిలబడాలని వారు శ్రీరాములు కి వినతి పత్రం అందజేశారు. అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పూర్తిగా రైతుల పక్షాన అండగా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇష్టం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేయకూడదని తెలిపారు. రైతులు ఎవరు కూడా అధైర్య పడొద్దు అని త్వరలోనే రంగారెడ్డి జిల్లా ముద్దుబిడ్డ కేంద్ర మంత్రివర్యులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి ని కలిసి ఇట్టి విషయంపై చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని, అలాగే జాతీయ బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ వారికి కూడా మీ యొక్క ఆవేదన తెలియజేస్తామని, ఇట్టి విషయం పైన తాను ఎంతవరకైనా రైతుల పక్షాన పోరాడుతానని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా నాయకులు పాపయ్య గౌడ్ . మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్. తదితరులు పాల్గొన్నారు.