చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో జిల్లా స్థాయిలో సత్తా చాటిన గాంధీజీ విద్యార్థులు
చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో జిల్లా స్థాయిలో సత్తా చాటిన గాంధీజీ విద్యార్థులు
విశ్వంభర, చండూరు: తెలంగాణ జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలు-2024 కార్యక్రమంలో భాగంగా బాలబాలికల విద్యా, విజ్ఞానం, వికాసం కోసం గత వారం నిర్వహించిన చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో చండూరు మండలం నుండి స్థానిక గాంధీజీ విద్యాసంస్థలకు చెందిన పందిరి శివ ప్రియ (10వ తరగతి), శిరంశెట్టి అక్షర (9వ తరగతి), ఎం.ఇందు (8వ తరగతి) ముగ్గురు విద్యార్థులు మండల మొదటి స్థానం సాధించి ఈనెల 28వ తేదీన నలగొండ జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో పాల్గొని జిల్లా స్థాయి తృతీయ స్థానం సాధించినారు. ఇట్టి విజేతలను మండల విద్యాధికారి ఉట్కూరి సుధాకర్ రెడ్డి మరియు ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయుటకు ఈ టాలెంట్ టెస్ట్ లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నల్లగొండ జిల్లాలో మండల స్థాయిలో విజేతలైన 86 పాఠశాల విద్యార్థులు పాల్గొనగా గాంధీజీ విద్యాసంస్థల విద్యార్థులు తృతీయ స్థానం సాధించారని మండల విద్యాశాఖ తరపున విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, గాంధీజీ విద్యాసంస్థల యాజమాన్యంను మరియు ఉపాధ్యాయులను అభినందిస్తున్నానని తెలిపారు. ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండేలా తమ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నాయని, భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని దానికి తగిన విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, రఘు సురేష్, ప్రిన్సిపల్స్ సత్యనారాయణ మూర్తి, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.