నాటి వీర నారీల స్ఫూర్తితో ముందుకు సాగాలి..- సున్నితత్వంతో పాటు  శూరత్వం కలిగి ఉండాలి..

నాటి వీర నారీల స్ఫూర్తితో ముందుకు సాగాలి..- సున్నితత్వంతో పాటు  శూరత్వం కలిగి ఉండాలి..

- ఆధునిక సమాజంలో కుటుంబ విలువలను పరిరక్షించాలి..-ఆరోగ్య విలువలతో పాటు కుటుంబ పోషణ చూసుకోవాలి
 - దుర్గా వాహిని సభలో వక్తల సందేశం 

విశ్వంభర, హైదరాబాద్ ; నేటి తరం యువతులు చదువు, ఉద్యోగాలతో పాటు నాటి వీర వనితల పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి అన్నారు. యువతులు సున్నితత్వంతో పాటు  శూరత్వం కలిగి ఉండాలని సూచించారు. ఆదివారం అష్టలక్ష్మి దేవాలయం సమీపంలో విశ్వహిందూ పరిషత్ యువతి విభాగం దుర్గా వాహిని సమావేశం నిర్వహించారు. అంతకుముందు అష్టలక్ష్మి దేవాలయం పరిసర ప్రాంతం మొదలుకొని చైతన్యపురి, కొత్తపేట, విక్టోరియా మెమోరియల్ మెట్రో రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలలో ప్రధాన రహదారి వెంబడి  1500 మంది దుర్గా వాహిని యువతులు ర్యాలీ నిర్వహించారు. కాషాయ జెండాలు చేతబట్టి సాగిన ర్యాలీ.. జైశ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లింది. దాదాపు 100 మంది  చిన్నారులు భరతమాత తో పాటు నాటి వీర మాతల వేషాధరణతో అలరించారు. ప్రధాన దారి వెంట సాగిన ర్యాలీ.. ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో రోడ్డు వెంబడి ప్రజలు చూస్తూ నిలబడిపోయారు. అనంతరం అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణంలో యువతులు శక్తి ప్రదర్శన నిర్వహించి ఆకట్టుకున్నారు. ముందుగా భరతమాత, రాణి దుర్గావతి, అహల్యాబాయ్ హోల్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజా  చేశారు. దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కు భాయి సభా అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా డాక్టర్ శిరీష , ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ శిల్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీత రెడ్డి మాట్లాడుతూ.. నేటి యువతులు ఆధునికత పేరుతో అస్తవ్యస్తమైన జీవన విధానాన్ని అవలంబించడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశము , ధర్మము,  సమాజం పట్ల బాధ్యత కలిగి జీవించాలని సూచించారు. చదువుతోపాటు విలువలతో కూడిన వ్యక్తిత్వం నేటి యువతరానికి ప్రాథమిక అవసరంగా గుర్తించాలని పేర్కొన్నారు. దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కుబాయి మాట్లాడుతూ.. మాతృ వందన కార్యక్రమం పేరుతో నాటి వీర వనితల స్ఫూర్తిని స్మరించుకుంటామన్నారు. నిత్యజీవితంలో సైతం ఎలాంటి విపత్కర  పరిస్థితుల్లోనైనా తమను తాము కాపాడుకోవాలని ఆత్మవిశ్వాసం బోధించారు.  శారీరక , మానసిక, నైతిక వికాసం తో కూడిన యువతులు తయారు కావాలన్నారు. ఆత్మరక్షణ కోసం విద్యలు నేర్చుకొని తమను తాము కాపాడుకోవాలని సూచించారు. డాక్టర్ శిరీష మాట్లాడుతూ.. యువతులు ఆరోగ్య విషయాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఎంతటి చదువు ఉన్నప్పటికీ కుటుంబ విలువలు మరువకూడదని వివరించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భోజన పల్లి నరసింహమూర్తి, లక్ష్మీనారాయణ,VHP రాష్ట్ర పూర్వ అధ్యక్షులు సురేందర్ రెడ్డి ,  జాతీయ అధికార ప్రతినిధి శశిధర్, మాతృ శక్తి రాష్ట్ర కన్వీనర్ పద్మశ్రీ, దుర్గా వాహిని నాయకులు సింధుజ, మాధవి, ఉమారాణి, శిరీష, నిఖిల, సంకల్ప, భవాని, మీనా, లత శ్రీ , జ్యోతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

 

Read More పేటలో ఘనంగా సునీత జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

Tags: