ప్రజా విజయోత్సవ కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి
ప్రజా విజయోత్సవ కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి
విశ్వంభర, భూపాలపల్లి :డిసెంబర్ 1 నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్ని శాఖల అధికారులను అదేశించారు.
ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు, ఆదివారం జరుగనున్న ప్రజా పాలన విజయోత్సవ వేడుక కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీ కరణ తదితర అంశాలపై శనివారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వేతర సంస్థలను విద్యుద్ధికరణ చేయాలని ఆదేశించారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ పరిధిలో ని ప్రధాన కూడళ్లును విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సుభాష్ నగర్ కాలనీలోని, సింగరేణి కమ్యూనిటీ హాలులో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరుగనున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆదేశించారు. 1 నుండి 9 వరకు ప్రతిరోజు ఒక్కో శాఖ ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ప్రతి రోజు చేసిన కార్యక్రమాలను డాక్యుమెంటేషన్ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీపీఆర్వో శ్రీనివాస్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.