ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న
నల్గొండ- ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 1.92లక్షల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు.
నల్గొండ- ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 1.92లక్షల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అందులోమల్లన్నకు 14 వేల ఓట్ల ఆధిక్యం లభించింది. ఇంకా లెక్కించాల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్లే 1.44 లక్షలు ఉన్నాయి. అందులో చెల్లనిఓట్లు వేరుచేయాల్సి ఉంది.
ఇప్పటి వరకు మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 9,019 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి 34,575, బీఆర్ఎస్ అభ్యర్థికి 27,573, బీజేపీ అభ్యర్థికి 12,841, స్వతంత్ర అభ్యర్థికి 11,018ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఇప్పటి వరకు 70,785 ఓట్లు పోల్ అయ్యాయి.
బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొత్తంగా 56,113 ఓట్లు పోల్ కాగా, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 24,236, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 20,037 ఓట్లు పోల్ అయ్యాయి. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు 14,672 మెజారిటీని సాధించారు. మొత్తం పోల్ అయిన ఓట్లు 3,36,013 కాగా ఒక్కో రౌండ్‌కు 96వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత కోసం నాలుగు రౌండ్లలో ఓట్లు లెక్కిస్తున్నారు అధికారులు.
ఇప్పటి వరకు రెండు రౌండ్లు కలిపి లక్షా 92వేల ఓట్లు లెక్కింపును పూర్తి చేశారు. మరో రెండు రౌండ్లు మిగిలి ఉండగా ఇంకా లక్షా 44వేల ఓట్లు మిగిలి ఉన్నాయి. ఇవాళ(గురువారం) సాయంత్రం లోపు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశముంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత రెండో ప్రాధాన్యత కోసం 52మంది అభ్యర్థుల్లో ఒక్కొక్కరిని ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది.