‘బీజేపీ కోసమే బీఆర్ఎస్ బలిదానం..’ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇవాళ(బుధవారం) మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ గెలిచిన ఎనిమిది స్థానాల్లో ఏడింటికి బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. ఈ విషయాన్ని తాను మొదటి నుంచీ ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నానని తెలిపారు. సిద్దిపేటలో హరీశ్ రావు తమ పార్టీ ఓట్లను రఘునందన్ రావుకు వేయించారని దుయ్యబట్టారు.
తమ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు ఎప్పటికీ ఆగవని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన ఓ రాజకీయ జూదగాడు అంటూ సెటైర్ వేశారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌తో కలిసి మోడీ తమ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తే మహారాష్ట్ర ఫలితాలే వస్తాయని హెచ్చరించారు. అక్కడ మహా కూటమి ప్రభుత్వాన్ని కూల్చితే మోడీ తలెత్తుకోలేని ఫలితాలను ప్రజలు ఇచ్చారని వెల్లడించారు. మోడీని దేశ ప్రజలు తిరస్కరించారని, ఒక్క వ్యక్తి పేరుతో ‘మోడీ గ్యారంటీ’ అనిచెప్పడం వల్లే బీజేపీకి మెజార్టీ రాలేదని స్పష్టం చేశారు.
అందుకే ఎన్డీయే కూటమిలోని మరో వ్యక్తిని ప్రధాని చేయాలని బీజేపీకి సూచించారని రేవంత్ రెడ్డి అన్నారు. వెంటనే మోదీని తన పదవికి రాజీనామా చేయాలని ఎన్డీయే నేతలు కోరాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బూడిదే మిగిలిందని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని కుట్ర చేస్తే బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. అదేవిధంగా ఏపీ ఫలితాలపై రేవంత్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు, జగన్ స్వాగతించారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని అన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గుర్తుచేశారు.