పరిపాలనను గాలికొదిలేసిన ప్రభుత్వం:మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
* ప్రతిపక్షాలపై దాడులకే ప్రాముఖ్యత ఇస్తుండ్లు
* రేవంత్ సర్కార్‌లో గురుకులాలపై నమ్మకం సన్నగిల్లుతోంది
* పేద బిడ్డలు చదువుకునే పాఠశాలలను బలోపేతం చేయాలి
విశ్వంభర, కాటారం: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలనను గాలికి వదిలేసిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం మండలంలోని కస్తూర్బా పాఠశాలను ఆయన సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో కొన్ని సమస్యలు పరిష్కారం అయినా మరికొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఒక విద్యార్థి ఆస్వస్థతకు గురై ఉందని, ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నామన్నారు. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం పరిపాలనను మరిచి ప్రతిపక్షాలపై దాడులకు ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో ఏడాదైన ఒక విధానం చెప్పడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో గురుకులాలు, మోడల్ స్కూల్‌లలో విద్యార్దులను చేర్చేందుకు రికమండేషన్‌లు ఉండేవని, కానీ ఈనాడు రేవంత్ సర్కార్‌లో గురుకులాలు, మోడల్ స్కూల్‌లపై నమ్మకం సన్నగిల్లుతోందని, గురుకుల పాఠశాలల నుంచి విద్యార్దులు వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలు,మోడల్ స్కూల్‌ల్లో అన్ని వసతులు కల్పించి బలోపేతం చేసే దిశగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, ప్రస్తుతం మోడల్ స్కూల్స్‌లో వంట గదులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. అట్టడుగు వర్గాలకు చెందిన పేదింటి విద్యార్ధులు చదువుకునే గురుకులాలు, మోడల్ స్కూల్‌ల బలోపేతం చేయాలని, మంచి వాతావరణం, నాణ్యమైన బోజనం అందించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.