స్మార్ట్ ఫోన్లు - సైబర్ నేరాలు
స్మార్ట్ ఫోన్లు - సైబర్ నేరాలు
విశ్వంభర, రామన్నపేట: స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తుంది అనేది నిత్య సత్యమైంది. ప్రజల అవసరాలు, అభిరుచులు వివిధ రకాల సమాచారం కోసం వెబ్ సైట్స్ ఆప్స్ ఉపయోగించడం సర్వసాధారణం అయ్యింది. కానీ ఇలాంటి సమయాల్లోనే ఆఫ్-లైన్, ఆన్-లైన్ పద్ధతుల్లో వీడియో, ఆడియో ప్రకటణలు వినియోగదారుల కోసం వ్యక్తిగత సమాచారం ఆధారంగా, ఇష్టాలతో సంబంధం లేకుండా, ప్రకటనలు ఇస్తున్నారు. వీటిని ఆసరాగా చేసుకుని ఆన్లైన్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. అభివృద్ధి పేరుతో ప్రజలు ప్రతినిత్యం అప్డేట్ అయి స్మార్ట్ ఫోన్స్, లాప్ టాప్, కంప్యూటర్ ల ఆధారంగా బ్యాంకు లావాదేవీలు, ఈ-కేవైసీ అప్డేట్స్, వివిధ రకాల వెబ్ సైట్స్ ఉపయోగించడానికి ఇంటర్నెట్ సేవలపై ఆధారపడవలసి వస్తుంది, తద్వారా సైబర్ నేరాల బారిన పడవలసి వస్తుంది. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఈమెయిల్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా నేరాలు, మొబైల్ యాప్ సంబందిత నేరాలు, వ్యాపార సంబందిత రాజీ అయ్యే నేరాలు, ర్యాంసన్ వేర్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ఫ్రాడ్స్, ఫేక్ కాల్స్, ఇన్సూరెన్స్ ఫ్రాడ్, లాటరీ స్కాం, చీటింగ్ స్కాం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ స్కాం, ఇలా పలు రకాలుగా హ్యాకింగ్ చేసి ఆర్థిక సంబంధమైన లావాదేవీల ద్వారా సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. కావున వినియోగదారులు, ప్రజలు చైతన్యంతో ఆలోచించి ప్రభుత్వ గుర్తింపు గల నెట్వర్క్ తోటే, వెబ్ సైటును ఓపెన్ చేసి ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా అనవసరమైన కాల్స్ ను, మెసేజెస్ ను గాని, ఓపెన్ చేయడం మానుకోగలరు. సంబంధం లేని వ్యక్తులు, సంస్థలు గాని చేసి ఓటీపీలు చెప్పమనడం, ఓపెన్ చేయండి అనడం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. లింక్స్ ఓపెన్ చేయడం, ఓటీపీలు చెప్పడం ద్వారా ఫిషింగ్ సోషల్ ఆన్లైన్ కం స్కాం, సోషల్ ఇంజనీరింగ్ కాల్స్ చేయడం జరుగుతుంది. సైబర్ నేరగాళ్లు మన సమాచారాన్ని, వ్యక్తిగత అంశాలను ఫేస్బుక్ ద్వారా, ఇంస్టాగ్రామ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇట్టి పాస్ వర్డ్స్ తరచూ మారుస్తూ ఉండాలి. సైబర్ నేరగాళ్లు ప్రొఫైల్స్ చూసి తప్పుడు సమాచారం మెయిల్స్ పంపడం, బ్యాంకు ఖాతాల సమాచారం, ఏటీఎం సమాచారం లక్షలు కాజేసిన సందర్భాలు కోకోల్లలు. ప్రజల భద్రతకు మరియు జాతీయ ఆర్థిక భద్రతకు ముప్పు కలిగిస్తాయి. వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని ఒక ప్లాన్ ప్రకారం హ్యాక్ చేసి, నువ్వు వ్యాప్తి చేసి, సాఫ్ట్వేర్ పైరసీ, నకిలీ బ్యాంకు కాల్స్, సైబర్ బెదిరింపుల ద్వారా, ముఖ్యంగా మహిళలైతే వారి చిత్రాలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా చూపించి, బెదిరింపులకు పాల్పడతారు. మహిళలు యాప్స్ లోనూ వ్యక్తిగతమైన సమాచారం ఫోటోలను పోస్ట్ చేయకూడదు. సైబర్ నేరాల బారిన పడకూడదు అంటే ముఖ్యంగా అప్డేట్ సాఫ్ట్వేర్ యూస్ చేయాలి, అంటీ వైరస్ డివైసెస్ ఉపయోగించాలి, ఓటీపీను ఎవరితో షేర్ చేయకూడదు, అనుమతి ఉన్న కంపెనీల వెబ్సైట్స్ ఓపెన్ చేయాలి. చాలా నమ్మకమైన పాస్వర్డ్ పెట్టుకోవాలి. తరచూ వాటిని మారుస్తుండాలి. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వాడేటప్పుడు వ్యక్తిగత సమాచారం జాగ్రత్తగా ఉంచుకోవాలి. పలు రకాల ప్రదేశాల్లో సంస్థల్లో నెట్వర్క్ యూస్ చేసినప్పుడు పాస్వర్డ్స్ మార్చుకోవాలి. ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఆర్థిక నేరగాళ్లకు, సైబర్ క్రైమ్ నెరగాళ్లకు శిక్షలు విధిస్తున్నప్పటికీ, ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించి, స్మార్ట్ ఫోన్స్ వాడేటప్పుడు మెసేజ్ లు వచ్చిన కాల్స్ వచ్చిన ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అన్నిటికంటే ఉత్తమం. ఏదైనా అనుమానం కలిగితే పోలీస్ శాఖ వారిని, బ్యాంక్ అధికారులను కూడా సంప్రదించడం ఉత్తమం. స్మార్ట్ ఫోన్ అనేది ప్రపంచాన్ని ఎంత దగ్గరకు చేర్చిందో, ప్రమాదాన్ని కూడా అదే స్థాయిలో తీసుకువచ్చింది. వినియోగించడం తప్పనప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం. లేని పక్షంలో ఆర్థికంగా నష్టపోయి, వ్యవస్థ మీద దెబ్బ పడే అవకాశం ఉందని న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారులు కూనూరు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.