టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ...!
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సీఎం పదవి రెడ్డి సామాజిక వర్గానికి, డిప్యూటీ సీఎంగా ఎస్సీకి అవకాశం కల్పించారు.దీంతో పీసీసీ అధ్యక్షుడి పదవిని బీసీకి ఇవ్వాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ బీసీల్లో బలమైన సామాజిక వర్గాల్లో ఒకటి గౌడ సామాజిక వర్గం. దీంతో ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దీంతో మహేశ్ కుమార్ గౌడ్ కే పీసీసీ చీఫ్ పదవి దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు.
అయితే పీసీసీ పదవి కోసం మంత్రులతో సహా ముఖ్యనేతలు పోటీ పడ్డారు . డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు , మధు యాష్కీ గౌడ్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి , జగ్గారెడ్డి , సీతక్క , బలరాం నాయక్ , సంపత్ కుమార్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది .కానీ చివరికి రేసులో మహేష్ కుమార్ గౌడ్ , బలరాం నాయక్ పోటీ పడ్డారు . అయితే సీఎం రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం, బీసీ నాయకుడు కావడం , ఎన్ ఎస్ యూ ఐ నుండి పార్టీ లో ఎదిగిన నేతగా ఉండడం మహేష్ కుమార్ గౌడ్ కు కలిసి వచ్చింది అని తెలుస్తుంది . అలాగే టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ మద్దతు తెలుపడంతో, ఇటు పార్టీ అటు ప్రభుత్వం రెండు సమన్వయంగా పనిచేసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో రేవంత్ మద్దతు తెలిపిన మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ చీఫ్ గా నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధం అయినట్లు తెలుస్తుంది
ఇక పీసీసీ నియామకంతో పాటు మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పదవులు, పీసీసీ అధ్యక్ష పదవిపై పార్టీ పెద్దలతో చర్చ జరిపినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో బీసీల్లో మరో బలమైన సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గం. ఈ సామాజికవర్గానికి ఈసారి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సారి హైదరాబాద్ , రంగారెడ్డి , ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు రానున్నాయి.నిజామాబాద్ జిల్లా నుండి సుదర్శన్ రెడ్డి , ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రేమ్ సాగర్ రావు , మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు క్యాబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది .