ఒక్క రూపాయి విషయంలో గొడవ.. ఆటోడ్రైవర్ మృతి

ఒక్క రూపాయి విషయంలో గొడవ.. ఆటోడ్రైవర్ మృతి

వరంగల్‌లో దారుణ ఘటన జరిగింది. ఒక్క రూపాయి విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కారణంగా నిండు ప్రాణం పోయింది. ఈ విషాద సంఘటన వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో జరిగింది.

ఈ మధ్య కాలంలో చిన్నపాటి కారణాలకే గొడవ పడి ప్రాణాలను తీసేస్తున్నారు. తాజాగా వరంగల్‌లో దారుణ ఘటన జరిగింది. ఒక్క రూపాయి విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కారణంగా నిండు ప్రాణం పోయింది. ఈ విషాద సంఘటన వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 

శుక్రవారం రాత్రి గాంధీనగర్‌లోని ఓ బిర్యానీ పాయింట్ వద్దకు బిర్యాని కోసం వెళ్లారు. అదే సమయంలో అరవింద్ అనే యువకుడు బిర్యానీ కోసం అక్కడకు వచ్చాడు. ఆటోడ్రైవర్ ప్రేమ్‌సాగర్ రూ.59 బిర్యానీకి, రూ.60 ఫోన్ పే చేశాడు. ఈ క్రమంలో ఒక్క రూపాయి ఎక్కువ కొట్టావ్ అంటూ అరవింద్ ఆటో డ్రైవర్‌ను ఎగతాళి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వివాదానికి దారి తీసింది. క్షణికావేశంలో ఇద్దరు పిడిగుద్దులకు దిగారు. 

Read More పరిపాలనను గాలికొదిలేసిన ప్రభుత్వం:మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

ఈ తోపులాటలో అరవింద్ ఆటో డ్రైవర్ ప్రేమ్ సాగర్ బలంగా నెట్టేయడంతో కిందపడి పక్కనే ఉన్న రాయి తగిలి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అరవింద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.