అర్థరాత్రి గులాబీకి గుడ్ బై.. హస్తం గూటికి ఆరుగురు ఎమ్మెల్సీలు

అర్థరాత్రి గులాబీకి గుడ్ బై.. హస్తం గూటికి ఆరుగురు ఎమ్మెల్సీలు

  • * హస్తం గూటికి ఆరుగురు ఎమ్మెల్సీలు
    * రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక 
    * కండువా కప్పి ఆహ్వానించిన దీపాదాస్ మున్షీ
    * సీఎం ఢిల్లీ నుంచి వచ్చే వరకు వెయిటింగ్
    * తెల్లారితే అమావాస్య ఉందని ఆగమేఘాల మీద చేరిక
    * శాసన మండలిలో 12 మందికి చేరిన కాంగ్రెస్ సభ్యుల సంఖ్య

విశ్వంభర, హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే వరుసబెట్టి హస్తం పార్టీలోకి వెళ్తున్న గులాబీ ఎమ్మెల్యేలకు తోడు గురువారం అర్థరాత్రి  ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు దండే విటల్, భాను ప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, బసవరాజు సారయ్య రాత్రి 11 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. సీఎం ఢిల్లీ నుంచి తిరిగి వస్తున్న నేపథ్యంలో ఆయన వచ్చే వరకు సుమారు 2 గంటలపాటు వేచి ఉన్నారు. ఆయన వచ్చిన  కొద్దిసేపు చర్చలు జరిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ ఆరుగురు ఎమ్మెల్సీలకు  పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. తెల్లారితే అమావాస్య ప్రారంభం అవుతున్న కారణంగా రాత్రికి రాత్రే పార్టీ మారిపోయి ఎమ్మెల్సీలు సంచలనం సృష్టించారు. చేరికల సమయంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి,మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు తదితరులు వారి వెంట ఉన్నారు. 

మండలిలో కాంగ్రెస్‌కు పెరిగిన బలం

ప్రస్తుతం శాసనమండలి సభ్యుల సంఖ్య 40. వీటిల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకు మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీల సంఖ్య ఆరుగా ఉండగా.. తాజా చేరికలతో ఆ పార్టీ బలం 12 మందికి పెరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరకలు ఇంతటితో ఆగిపోలేదని, టీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసేవరకు కొనసాగుతాయిని హస్తం పార్టీ నేతలు ధీమాతో చెబుతున్నారు.  కాగా, గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండేందుకు మాజీ సీఎం కేసీఆర్ పది రోజులుగా జిల్లాల వారిగా మీటింగులు పెట్టి బుజ్జగిస్తున్న సంగతి తెలిసిందే. కానీ కేసీఆర్ దగ్గర ఫిరాయింపులకు పాల్పడమని చెప్పి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయటకురాగానే కండువాలు మార్చుతుండటం ఆ పార్టీని కలవరపెడుతోంది. 

Read More జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

Read Details  on EPAPER : https://epaper.vishvambhara.com