మహిళా శక్తి కార్యక్రమం అమలులో మన జిల్లా ఆదర్శంగా నిలవాలి
మహిళాశక్తిలో మన జిల్లా బ్రాండ్ క్రియేట్ చేయాలి ... జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
విశ్వంభర భూపాలపల్లి జూలై 24 : - మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికాభివృద్ది ని సాధించి పారిశ్రామిక వేత్తలు గా ఎదగాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళాశక్తి కార్యక్రమంపై మండల, జిల్లా మహిళా సమాఖ్యల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు, డిపిఎం లు, ఏపియంలు, సిసిలు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో అవగాహన సమీక్షా సదస్సు నిర్వహించారు.
మహిళా సమాఖ్యల ద్వారా 13 అంశాలలో వ్యాపారులు నిర్వహణకు అవకాశం ఉన్నదని, మహిళా శక్తి యూనిట్లు ఎంపికపై మహిళా సమాఖ్య సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.మహిళా శక్తి కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించడానికి ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో 11 మండల, ఒక జిల్లా సమాఖ్యలున్నాయని తెలిపారు. 364 గ్రామ సమాఖ్యలు, 8050 మహిళా స్వయం సహాయక సంఘాల్లో 84645 మంది సభ్యులున్నారని తెలిపారు. వీటిలో 66 దివ్యాన్గుల సంఘాలున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం 255.82 కోట్లు బ్యాంక్ లింకేజీ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 61.06 కోట్లు లాక్ష్యాన్ని సాధించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధిని మెరుగుపరచడానికి మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో అత్యంత పటిష్టమైన వ్యవస్థ మహిళా సంఘాలేనని ఆర్థిక సాధికారత, సంపద సృష్టికి మహిళా సంఘాలు కేంద్రాలుగా మారడం ద్వారా అర్థికాభివృద్ధి సాధనకు అవకాశం కలుగుతుందని తెలిపారు. 13 యూనిట్లు ఏర్పాటు లక్యం కాగా 4561 మందిని ఎంపిక చేయాల్సి ఉన్నట్లు తెలిపారు.
స్వయం సహాయ సంఘాల ద్వారా పలు రకాల సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు ద్వారా వ్యాపారాలను ప్రోత్సహించి మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించడం, మహిళల సామాజిక భద్రత కోణంలో సంఘాలను బలోపేతం చేయడం మహిళా శక్తి ప్రధాన లక్ష్యమని అన్నారు. సూక్ష్మ తరహా పరిశ్రమలను గుర్తించి, సంఘాలను ప్రోత్సహించడం, ఆయా సంఘాలలో మహిళలు తమ నైపుణ్యాలకు తగ్గ వ్యాపారులు ఎంచుకుని, అవసరమైన నైపుణ్యాన్ని అందించడం ద్వారా వ్యాపారాభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహకారం కోసం బ్యాంక్ లింకేజీల ద్వారా రుణాలు అందుచేయనున్నట్లు తెలిపారు. ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పనకు అవసరమైన ప్రణాళికలు, సహకారం అందివ్వడం మహిళాశక్తి పథక లక్ష్యమని అన్నారు.
మహిళా శక్తి పథకంలో జిల్లాలో మైక్రో ఎంటర్ప్రైజెస్, పర్మనెంట్ స్టిచింగ్ సెంటర్లు, పాడి గేదెల పెంపకం, మొబైల్ ఫిష్ అవుట్ లెట్, పాల డైరీల ఏర్పాటు, మీ సేవా కేంద్రాలు, మహిళా శక్తి క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కష్టం హైయరింగ్ కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ తదితర 13 రకాల జీవనోపాదులు కల్పన జరుగుతుందని సూచించారు. మహిళా సంఘాలు బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా శక్తి పథకం అద్భుతమైన కార్యక్రమమని, ఈ పథకాన్ని జిల్లాలో దిగ్విజయంగా అమలు చేసి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మన జిల్లాను ఆదర్శంగా తయారు చేయాలని సూచించారు. మహిళా సంఘాలు ద్వారా
జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులు, అంగన్వాడీ చిన్నారులకు ఏకరూప దుస్తులు కుట్టించే కార్యక్రమాన్ని చేపట్టామని, అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన పనులు అప్పగించామని తెలిపారు. యూనిఫామ్స్ కుట్టే పనులు పూర్తి అయ్యాయని తదుపరి మాల్స్, ఏజెన్సీల నుండి దుస్తుల ఆర్డర్లు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్డీఓ కు సూచించారు. నాణ్యత పాటించడం వల్ల వ్యాపారం వృద్ది చెందుతుందని, తద్వారా మీరే ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారని ఆయన తెలిపారు. మన జిల్లాలో ప్రసిద్ధి చెందిన కాళేశ్వరం, కొడవ టన్చ దేవాలయాలు, పాండవుల గుట్ట వంటి పర్యాటక ప్రాంతాలు న్నాయని అలాంటి తదితర జన సంచారం ఉండే ప్రాంతాలలో క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆహార పదార్థాలు తయారులో నాణ్యత పాటించాలని అన్నారు.
ఇష్టపడి పనిచేస్తే చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుందని, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధన జరుగుతుందని తెలిపారు. ఎంచుకున్న వ్యాపార రంగాలపై గ్రామ, మండల, జిల్లా సమాఖ్య సమావేశాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మహిళా శక్తి పథకానికి ఆసక్తి, అనుభవం, చేయాలన్న సంకల్పం ఉన్న లబ్ధిదారులను ఎంపిక ఆగష్టు 1వ తేదీ వరకు ఎంపిక చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో విజయ పాల సేకరణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తృణ ధాన్యాల తయారును కూడా ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని డిఆర్డీఓ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ నరేష్, అదనపు డిఆర్డిఓ గోవింద రావు, డిపిఎంలు, ఏపీఎంలు, సిసిలు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బండారు మంజుల, కార్యదర్శి స్వరూప, మండల గ్రామ సమాఖ్యల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.