వర్షాలు, వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
On
జిల్లా కలెక్టర్, ఎస్పీ, అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
విశ్వంభర భూపాలపల్లి జూలై 22 : - గత వారం రోజులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, అన్ని శాఖల జిల్లా అధికారులతో సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని అన్నారు. వరద ఉదృతి గల వాగుల పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా వాగులపై రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అన్ని విధాలుగా అప్రమత్తం చేయాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి వెళ్లోద్దని విజ్ఙప్తి చేశారు.గతేడాది ఇదే నెలలో మోరంచపల్లి గ్రామంలో వరదలు సంభవించి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగిందని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ఉదృతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కాపాడుకోవాల్సిన భాద్యత మనపై ఉందని స్పష్టం చేశారు. మోరంచవాగు మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుందని వరద ప్రభావం ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. గణపసముద్రం చెరువు నీటిమట్టం రోజు రోజుకు పెరుగుతూ ఉందని నీటిమట్టం పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అప్రమత్తతో ఉండాలని ఆదేశించారు. గణపసముద్రం చెరువు ద్వారా సాగవుతున్న ఆయకట్టు రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు.
ధర్మారావుపేట ఊర చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్..
భూపాలపల్లి కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి చెరువు కట్టను పరిశీలించారు. గతేడాది ఇదే సమయంలో ధర్మారావుపేట ఊర చెరువు కట్ట నాలుగు చోట్ల గండ్లు పడగా, వాటిని నీటిపారుదల శాఖ మరమ్మత్తులు చేసింది. మళ్ళీ భారీ వర్షాలు కురిస్తే కట్ట పరిస్థితిపై ఇరిగేషన్ అధికారులను ఎమ్మెల్యే, కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.