విద్యార్థులకు కన్నబిడ్డల్లా చూసుకోవాలి:సీఎం రేవంత్‌రెడ్డి
* ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు
* ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు
విశ్వంభర, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని అధికారులను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలన్నారు. వసతి గృహాల్లో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.‘‘విద్యార్థులకు పరిశుభ్ర వాతావారణంలో పౌష్టికాహారం అందజేయాలి. మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచాం. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. బాధ్యులైన వారిపై జిల్లా కలెక్టర్లు వేటు వేయాలి. వదంతులతో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల్లోంచి తొలగించేందుకూ వెనుకాడబోం’’ అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.