మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడం విశేషం.
బీఆర్‌ఎస్ తరఫున నవీన్‌కుమార్ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ బరిలో నిలిచారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. పార్టీ వారీగా బీఆర్ఎస్ 763, కాంగ్రెస్, 652, స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు పోలయ్యాయి.
ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారారు. అనంతరం ఆయన కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో మార్చి 28వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు మిన్నంటాయి.
కాగా, తాజాగా ఎమ్మెల్సీ స్థానం గెలుపుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ కుమారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ గెలుపు తమ బాధ్యతలను మరింత పెంచిందన్నారు. ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపునకు శ్రమించిన బీఆర్ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.