ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు.. సీపీఎం తీర్మానం
తెలంగాణలో 6 నెలలుగా ఎన్నికల వేడి కనిపిస్తోంది. మొదట అసెంబ్లీ ఎన్నికలతో అన్ని పార్టీ ప్రచారాన్ని హోరెత్తించాయి. ఆ తర్వాత 2 నెలలు ఆ వాతవరణం పెద్దగా కనిపించకపోయినా.. వెంటనే పార్లమెంట్ ఎన్నికలతో మళ్లీ ప్రచారం ఊపందుకుంది. పార్లమెంట్ ఎన్నికల పూర్తి కాకముందే ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కూడా నోటిఫికేషన్ వచ్చింది. దీంతో.. రాజకీయ వాతవరణం మరింత వేడెక్కింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కూడా పూర్తి కావడంతో
ఇప్పుడు అన్ని పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికపై ఫోకస్ చేశాయి.
నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యువేట్ ఎమ్మెల్సీని సొంతం చేసుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ముగ్గురు బలమైన అభ్యర్థులు కావడంతో ఏ చిన్న అవకాశాన్ని కూడా పార్టీలు వదులు కోవడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉండటం.. మలన్నకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండటం హస్తం పార్టీకి అదనపు బలంగా ఉంది. కానీ.. వీలైంత ఎక్కువ మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా సీపీఎం కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.
ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధికారిక ప్రకటన చేశారు. తీన్మార్ మల్లన్నను గెలిపించడానికి అన్ని విధాల కృషి చేస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కోసం ఇండియా కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని అన్నారు. అదే విధంగా ఇప్పుడు కూడా బీజేపీని ఓడించడం కోసం ఇండియా కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. పట్టభద్రులంతా మల్లన్నను గెలిపించాని విజ్ఞప్తి చూస్తూ తమ్మినేని వీరభద్రం ప్రకటన విడుదల చేశారు.