నాడు జీవ కళ నేడు జీవన్మరణ వ్యధ
చేనేత వృత్తి కాదు మేనుకు ముసుగుతో సిగ్గును కాపాడిన తోరణం
విశ్వంభర, హైద్రాబాద్ : ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి ఈ దేశంలో చేనేతల గొప్పతనం చెప్పుకోవాడనికే తప్ప ఆచరణలో లేదని తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు అంశాలతో కూడిన డిమాండ్లకు పరిష్కార మార్గాలను చూపాలని కోరారు. వృత్తి పేరుతో సమిధుల అవుతున్న నేతన్నలను కాపాడి రక్షణ కల్పించాలని అన్నారు. చేనేత నైపుణ్యం తరతరాల సంస్కృతిక ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఒకనాడు ఒకటే మగ్గం ఉండి సంతోషంగా ఉన్నామని నేడు పది మగ్గాలు ఉన్న బ్రతుకు తెరువు భారంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, విదేశాలకు ఎగుమతులు చేసి చేనేత కళన విశ్వవ్యాప్తం చేసి చేనేత కు గుర్తింపు కల్పించాలని కోరారు. అన్ని రాష్ట్రాల రాజధానుల నగరాలలో చేనేత వస్త్ర ప్రదర్శనలు క్రయవిక్రయాల స్టాల్స్ ఏర్పాటు చేయాలి. జనతా వస్త్రాలను మళ్ళీ వెలుగులోకి తెచ్చి చేనేతకు ప్రోత్సాహం కల్పించాలి. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ రంగాలలో సంస్థలలో కార్యాలయాలను ఉద్యోగులందరూ చేనేత వస్త్రాలు ధరించి విధులలో పాల్గొనే విధంగా జీవో విడుదల చేయాలని తెలిపారు. చేనేత అనేది ఒక చీవకలాన్ని మనిషి అందానికి శ్రీకారం చుట్టిందని నేడు ఆ చేనేత కనుమరుగే పరిస్థితులు కనబడుతున్నాయి అన్నారు. పీతాంబర వస్త్రాలతో అతివలకు అపురూపంగా అందించిన చేనేత ఎన్నో రంగుల వర్ణాలతో ప్రకృతిని చీరలో మలిచి గొప్పతనాన్ని చాటిందని అన్నారు. నేడు మనిషి మనుగడకు జీవం పొస్తూనే ఉన్న వ్యవసాయం, చేనేత రంగాలను , స్వాతంత్ర ఉద్యమంలో స్వదేశీ వస్త్రాలను అందించే విధంగా మద్దతు తెలిపిన నేతన్నాలను ఈ ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తూనే ఉన్నారు. చేనేత మీద జిఎస్టి రద్దు చేయాలని , మరింత ప్రోత్సాహకరం అందించే పథకాలను ప్రవేశపెట్టాలని కోరారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్ధరించి సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన వ్యవస్థతో ముందుకు రావాలని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కళాకారులకు కేంద్ర ప్రభుత్వమే సర్వే చేయించి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ లు అందజేయాలి. హౌస్ కం వర్క్ షెడ్స్ ప్రతి నేత కార్మిక కుటుంబానికి మంజూరు చేయాలి. ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి ఎలాంటి షరతులు లేకుండా ముద్ర లోన్ పరంగా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఆర్థిక ప్రోత్సాహం అందించాలి. పైన పేర్కొన్న పలు అంశాలతో కూడిన డిమాండ్లను తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పక్షాన కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం, ప్రాచీన కాలం బ్రతికించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. త్వరలోనే తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రతినిధుల బృందంతో న్యూఢిల్లీలోని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కలిసి చేనేత కార్మికుల సంక్షేమం కోసం పలు అంశాలను కూడిన వినతి పత్రం అందజేస్తమని అన్నారు.