తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగింపు సమంజసం కాదు

తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగింపు సమంజసం కాదు

ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ డిమాండ్ 

విశ్వంభర, సూర్యాపేట : భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ముఖ్యంగా తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం గావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు
 మాశెట్టి అనంత రాములు తెలిపారు.  పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో, రాష్ట్రానికో చెందిన వ్యక్తి కాదు. దేశం గర్వించదగ్గ నాయకుడు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడని,  స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొని మహాత్మా గాంధీ ప్రశంసలు అందుకున్నారని తెలియజేసారు.  హరిజనోద్ధరణే తన లక్ష్యంగా స్వీకరించి హరిజనులకు దేవాలయాల ప్రవేశానికై నిరాహార దీక్ష చేసి సమాజంలో వారి పట్ల ఉన్న వివక్షను రూపుమాపుటకు తీవ్రంగా కృషిచేసి వారి అభ్యున్నతికి పాటుపడ్డారు. ఆ మహనీయుడి జ్ఞాపకార్థం మన తెలుగు విశ్వవిద్యాలయానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కి వారి పేరు పెట్టుకుని భావితరాలకి వారి త్యాగాన్ని తెలియజేస్తూ వారిని సముచిత రీతిలో గౌరవించుకుంటున్నాము అని అన్నారు.  కానీ 02-08-2024 తేదీన జరిగిన అసెంబ్లీ సమావేశంలో తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు బదులుగా సురవరం ప్రతాప రెడ్డి  పేరు పెట్టాలని కమ్యూనిస్టు పార్టీ కోరికను పురస్కరించుకొని మొన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పేరు మార్పుకు ఆమోదం తెలపటం పట్ల మన రాష్ట్రంలోనే గాక ఇతర రాష్ట్రాలలో ఉన్న యావత్ ఆర్యవైశ్యులతో పాటు తెలుగు భాషాభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు.  సురవరం ప్రతాపరెడ్డి  తెలంగాణకు అందించిన సేవలు చిరస్మరణీయం అందులో ఎంత మాత్రం సందేహం లేదు. కానీ ప్రతాపరెడ్డి ని గౌరవించే క్రమంలో పొట్టి శ్రీరాములు పేరును తొలగించడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేసారు. సురవరం ప్రతాపరెడ్డి  జ్ఞాపకార్థం ఏదైనా కొత్త ప్రాజెక్టుకు వారి పేరు పెట్టి సముచిత రీతిలో గౌరవించాలని అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని భావితరాలకు తెలియజేసే విధంగా తెలుగు విశ్వవిద్యాలయానికి వారి పేరుని యధాతధంగా ఉంచుటకు పునరాలోచన చేయాలని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరపున ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాము అని పేర్కొన్నారు. 

 

Read More నిమోనియా లక్షణాలను గుర్తించే పోస్టర్ను విడుదల

Tags: