పరిగిలో దారుణం.. కుక్క దాడిలో 5నెలల చిన్నారి మృతి..!

పరిగిలో దారుణం.. కుక్క దాడిలో 5నెలల చిన్నారి మృతి..!

విశ్వంభర, పరిగి: ఐదు నెలల చిన్నారికి భైరవుడిలా కాపాలా ఉండాల్సిన పెంపుడు కుక్క.. విశ్వాసం మరిచి ప్రాణాలను బలి తీసుకుంది. ముక్కుపచ్చలారని బాలుడిపై యమకింకరుడిలా దాడి చేసి  ఉసురు తీసింది. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం వికారాబాద్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబ్ నగర్  జిల్లాకు చెందిన దత్తు, లావణ్య దంపతులు. వీరికి ఏకైన సంతానం సాయి ( 5 నెలల వయసు) ఉన్నాడు. ఈ దంపతులు తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతీ పరిధి బసవేశ్వర నగర్‌లో నివాసం ఉంటూ సంగెంకలాన్ గ్రామానికి చెందిన జి.నాగభూషణానికి చెందిన పాలిషింగ్‌ యూనిట్లో పనిచేస్తున్నారు. రోజుమాదిరగానే మంగళవారం కూడా దత్తు పాలిష్ యూనిట్లో నాపరాయి కట్ చేస్తున్నాడు.

Read More రాయపూడి భవాని భూమికి వేసిన ఇనుప కంచె వివాదం

ఈ క్రమంలో దత్తుకు దాహం వేయడంతో భార్యను మంచినీళ్లు తీసుకు రమ్మని చెప్పాడు. దీంతో లావణ్య పసికందును ఇంట్లో ఉంచి భర్తకు వాటర్ బాటిల్ తీసుకెళ్లింది. ఇంతలో అక్కడే ఉన్న పెంపుడు కుక్క ఇంట్లోకి చొరబడి ఐదు నెలల పసికందుపై అతి క్రురంగా దాడి చేసి పీక్కుతిన్నది. దీంతో ఐదు నెలల  బాబు గట్టిగా ఏడవడంతో తల్లి లావణ్య హుటాహుటిన ఇంట్లోకి పరుగుతీసింది. అక్కడికి వెళ్లి చూడగా పసి కందుపై పెంపుడు కుక్క దాడి చేయడాన్ని చూసి తల్లి ఖంగుతిన్నది.

వెంటనే తేరుకుని కుక్కను అక్కడి నుండి తరిమికొట్టి బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ కుక్క దాడిలో సాయి అప్పటికే మృతిచెందాడని వైద్యులు  ధ్రువీకరించారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, స్థానికులు పెంపుడు కుక్కను  కొట్టి చంపేశారు. సమాచారం అందుకున్న కరన్ కోట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.