ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర ఆందోళనలు

03

ముషీరాబాద్, జూలై 10(విశ్వంభర) :- సుదీర్ఘకాలం పెండింగ్ లోఉన్న ఆటో డ్రైవర్ల సమస్యల పరిస్కారం, ఆటో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల  మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చితామని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టంగా ప్రకటన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర ఆందోళనలు చేపట్టి, ఆటోలతో రహదారులను దిగ్బంధనం చేస్తామని ఏఐటీయూసీ తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. వెంకటేశం హెచ్చరించారు. న్యాయమైన ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ వందలాదిమంది ఆటో డ్రైవర్లతో సోమవారం హైదరాబాద్, హిమాయత్ నగర్  వై జంక్షన్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించింది. ఎర్ర జండాలు చేతబూని పెద్దఎత్తున నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ఆటో కార్మికులు దగ్ధం చేసారు. ఈ సందర్బంగా బి. వెంకటేశం మాట్లాడుతూ 2013 సంవత్సరం నుండి నేటివరకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వందశాతం పెరిగాయని కానీ అప్పటి నుండి నేటివరకు ప్రభుత్వాలు ఒక్కసారి కూడా ఆటో మీటర్ చార్జీలు పెంచలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరునెలలు గడుస్తున్నా ఆటో డ్రైవర్ల సమస్యల పరిస్కారం కోసం కృషి చేయడంలేదని విమర్శించారు. పాలకులు మారుతున్న ఆటో డ్రైవర్ల తలరాతలు మారడంలేదని, ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారుల వేధింపులు, జరిమానాలు, పెట్రో మంటలు, మరమ్మతులు, ఫైనాన్స్ వ్యాపారుల ఒత్తిళ్లు, కుటుంబబరం తో సతమతమౌతూ జీవితాలు వెళ్లదీస్తున్నారని అయన ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తక్షణమే చొరవ తీసుకొని ఆటో మీటర్ చార్జీలు పెంచి, వారి సంక్షేమానికి ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేసి, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12వేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేయాలనీ, దీనితోపాటు మహిళల  ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లు ను ఆదుకోవాలని బి. వెంకటేశం విజ్ఞప్తి చేసారు. ఏఐటీయూసీ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి మాట్లాడుతూ వాహన రంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉందని, ఆటో మోటర్‌ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అర్హులైన ఆటో కార్మికులకు  డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కేటాయించాలన్నారు. ఆటో మీటర్‌ రేట్లు పెంచి కొత్త ఆటో పర్మిట్లు జారీచేయాలని విజ్ఞప్తి చేసారు. యూనియన్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ జంగయ్య మాట్లాడుతూ కష్టాలతో సహజీవనం చేస్తున్న ఆటో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టో భరోసా ఇచ్చిందని, అది ఇప్పటివరకు అమలుకు నోచుకోకపోవడం బాధాకరం అని తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కరానికి చెర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రదర్శనలో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కొంరెల్లి బాబు, నేతలు ఏ. బిక్షపతి యాదవ్, ఎండి. ఒమేర్ ఖాన్, ఎస్కె. లతీఫ్, జి. మల్లేష్, అశోక్, భాస్కర్, రవి, ఘనీ బాబు, నర్సి రెడ్డి, దావూద్ తదితరులు పాల్గొన్నారు.

Read More వంటగది ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్ ఐ