కోకా కోలా కంపెనీ విస్తరణ.. రూ.700కోట్లతో తెలంగాణలో కొత్త ప్లాంట్
కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణకు మరో కొత్త ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. ప్రముఖ కూల్ డ్రింక్ కంపెనీ కోకాకోలా తన కంపెనీలను విస్తరించుకుంటోంది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణకు మరో కొత్త ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. ప్రముఖ కూల్ డ్రింక్ కంపెనీ కోకాకోలా తన కంపెనీలను విస్తరించుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రూ.700కోట్ల పెట్టుబడితో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌ను ఏర్పాటుకు సిద్ధమైంది. ఈప్లాంట్‌ను సంస్థ పూర్తి అనుబంధ సంస్థ అయిన హిందుస్తాన్ కోకా కోలా బెవరేజెస్(హెచ్‌సీసీబీ) నిర్మించనుంది.
ఈ కంపెనీ ఇప్పటికే పలు ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జూన్ 8వ తేదీన కోకా కోలా గ్రూప్ డైరెక్టర్ జోనథన్ రీఫ్‌తో అట్లాంటాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో తమ పరిశ్రమను విస్తరించాలని కంపెనీని మంత్రులు ఆహ్వానించారు.
మంత్రుల ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన జోనథన్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా కంపెనీ విస్తరణలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కంపెనీ తెలిపిందని సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. పెద్దపల్లి జిల్లాలో రూ.700 కోట్ల పెట్టుబడితో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌తో తయారీ సామర్థ్యాన్ని విస్తరించనుంది. పెద్దపల్లిలో ఈ కంపెనీ ప్లాంట్ ఏర్పాటుతో యువకులకు ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.