ఇవాళ్టి నుంచి మేడిగడ్డ రిపేర్లు.. దిగొచ్చిన ఎల్ అండ్ టీ!
మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ పనులు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి ఎల్ అండ్ టీ ఎట్టకేలకు అంగీకరించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎల్ అండ్ టీ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రిపేర్ పనులపై చర్చించారు. సొంత ఖర్చుతో మరమ్మతులు చేపడతామని ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. ఏయే పనులు చేయాలనే విషయంలో నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ మధ్యంతర నివేదికలో తేల్చింది. దానికి అనుగుణంగా ఎల్ అండ్ టీ పనులను ప్రారంభించనుంది.
మరో వారం రోజుల్లో నైరుతు రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఆ తర్వాత వర్షాలు కురుస్తాయి. కాబట్టి రాబోయే వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని పనులకు ఆటంకం లేకుండా అప్పటివరకు పూర్తి అయ్యేలా చూడాలని మంత్రి సూచించారు. దీంతో.. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. దీంతో.. ఇవాళ్టి నుంచే పనులు ప్రారంభించనున్నారు.
ఎల్ అండ్ టీ కంపెనీ పనులను మొదలుపెడితే ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అనేదానిపై క్లారిటీ వస్తుంది. మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్ పనులు చేయడానికి మొదట ఎల్ అండ్ టీ నిరాకరించింది. తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వానిదే బాధ్యత అని చేతులెత్తేసింది. అయితే చివరకు ప్రభుత్వ సంప్రదింపులతో ఎల్ అండ్ టీ దిగొచ్చింది.