సిపీఆర్ చేసి ఆరేళ్ల బాలుడి ప్రాణాలను కాపాడిన డాక్టర్ రవళి!
ఇటీవల కాలంలో చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా గుండెపోటు సమస్యలు అధికమవుతున్నాయి. అయితే చాలామంది గుండెపోటు వచ్చినప్పుడు ఆసుపత్రికి పరుగులు పెడుతూనే మధ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గుండెపోటుకు గురైనప్పుడు సిపీఆర్ పట్ల అవగాహన ఉండి సిపీఆర్ చేస్తే వారి ప్రాణాలకు ప్రమాదం ఉండదనే విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే సిపీఆర్ చేసి డాక్టర్ రవళి ఆరేళ్ల బాలుడిని కాపాడారు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ఆరు సంవత్సరాల సాయి అనే బాలుడు ఆడుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే ఆ బాలుడిని భుజాన వేసుకొని తన తల్లిదండ్రులు ఆస్పత్రికి పరుగులు పెట్టగా అక్కడే ఉన్నటువంటి డాక్టర్ రవళి ఆ బాలుడిని నేలపై పడుకోబెట్టి సిపీఆర్ చేశారు.
ఇలా సిపీఆర్ చేయడంతో కొద్దిసేపటికి ఆ బాలుడిలో కదలికలు వచ్చాయి. అనంతరం ఆ బాలుడిని ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాబు ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈ ఘటన ఈనెల 5వ తేదీ జరగగా తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో డాక్టర్ రవళి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.