ఆఫీసులకు పసుపు బిల్లతో వెళ్లండి.. టీ, కాఫీ ఇచ్చి మరీ పని చేస్తారు: అచ్చెన్నాయుడు

ఆఫీసులకు పసుపు బిల్లతో వెళ్లండి.. టీ, కాఫీ ఇచ్చి మరీ పని చేస్తారు: అచ్చెన్నాయుడు

  • ఏ ఆఫీసుకు వెళ్లినా కుర్చీవేసి పనిచేసి పెడతారు
  • 95శాతం సీట్లతో తిరుగులేని విజయాన్ని సాధించాం
  • మనది డబుల్ ఇంజన్ సర్కార్
  • ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

‘ప్రభుత్వాసుల్లో పని ఉంటే పసుపు బిల్లా పెట్టుకుని వెళ్లండి.. టీ, కాఫీ ఇచ్చి మరీ పనిచేసి పెడతారు’ అని వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి ఆయన శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతీ కార్యకర్త ఎస్సై దగ్గరకు వెళ్లినా, ఎమ్మార్వో దగ్గరికి వెళ్లినా, ఎండీవో దగ్గరకు వెళ్లినా, ఏ ఆఫీసుకు వెళ్లినా పసుపు బిల్ల పెట్టుకుని వెళ్ళాలన్నారు. 

అధికారులు గౌరవంగా కుర్చీ వేసి మరీ పని చేసిపెడతారని తెలిపారు. పని చేయించేలా అధికారులతో తగు సూచనలు చేస్తానని చెప్పారు. తన మాట జవదాటితే ఏమవుతారో వారికి నేను చెప్పాల్సిన అవసరం లేదంటూ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాలు పాటు కార్యకర్తలు అవమానాలు పడ్డారని, వారందరికీ తాను మాటిస్తున్నానని అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, 2019-24 మధ్య పరిపాలన ఎలా జరిగిందో చూశామన్నారు. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

రాష్ట్రంలో తన పార్టీ తప్ప ఇంకొక ఉండకూడదన్నట్లు జగన్ వ్యవహరించారని మండిపడ్డారు. కొన్నిసార్లు పార్టీ ఉందా?లేదా? అని నిద్రలేని రాత్రులు గడిపానని గుర్తుచేసుకున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 95 శాతం సీట్లు గెలిచిన చరిత్ర ఏ పార్టీకి లేదని, కూటమి ఆ స్థాయిలో విజయాన్ని సాధించిందన్నారు. ఇప్పుడు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్న అచ్చెన్నాయుడు..  తమది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకొచ్చారు. మోడీ సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తామని తెలిపారు.