అయ్యన్న ఒక ఫైర్ బ్రాండ్: చంద్రబాబు 

అయ్యన్న ఒక ఫైర్ బ్రాండ్: చంద్రబాబు 

  • ఏడుసార్లు గెలిచిన అరుదైన నాయకుడు
  • రాజీపడని నేత అంటూ ప్రశంసలు
  • గత ప్రభుత్వంలో సభా సంప్రదాయాలు తుంగలో తొక్కారు
  • కౌరవ సభకు రానని చెప్పా.. గౌరవ సభకు వచ్చా.. 
  • ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు 

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. అయ్యన్న పాత్రుని జీవితం కొత్త తరాలకు ఆదర్శమని అన్నారు. 42 ఏళ్లుగా ఒకే నియోజకవర్గంలో ఏడు సార్లు గెలిచిన అరుదైన నాయకుడని, రాజీపడని నేత అని కొనియాడారు.  

66ఏళ్ల వయసు ఉన్న అయ్యన్న పాత్రుడు ఒక ఫైర్ బ్రాండ్ అని చంద్రబాబు అభివర్ణించారు. కరడుగుట్టిన పసుపు యోధునిగా ఖ్యాతి గడించడం ఆయన ప్రత్యేకత అని ప్రశంసించారు. 25ఏళ్ల వయసులో అయ్యన్నపాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారని, ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

గత ప్రభుత్వ హయాంలో శాసనసభలో వ్యక్తిత్వ హననం చేశారని చంద్రబాబు అన్నారు. తన గురించి, తన కుటుంబం గురించి ఇష్టానుసారంగా కొందరు మాట్లాడి తనను బాధించారన్నారు. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు సైతం సీనియర్ శాసనసభ్యులను గెలిచేసి సభా సంప్రదాయాలను తుంగలో తొక్కారన్నారు. మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా సభను నడిపిద్దామని పిలుపునిచ్చారు.

తనపై క్లెమోర్ మైన్స్‌తో దాడి జరిగినా కన్నీరు పెట్టలేదని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. కానీ, సభలో రాజకీయాలకు సంబంధంలేని ఒక మహిళ వ్యక్తిత్వాన్ని హననం చేశారని, అది మొత్తం మహిళలకు జరిగిన అవమానంగా భావించి నేను కంటతడి పెట్టానని అన్నారు. ఈ కౌరవసభను గౌరవసభగా మార్చాలని ఆనాడే నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇప్పుడు గౌరవ సభకు వచ్చానని, ఈ సభను గౌరవంగా నడిపిద్దామని ఎమ్మెల్యేలు, మంత్రులకు సూచించారు. 

కూటమికి వచ్చిన 164 స్థానాలను 1+6+4= 11 అవుతుందనీ, వైసీపీకి అవే 11 స్థానాలు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. ఇదే దేవుడి స్క్రిఫ్ట్ అంటూ జగన్‌కు చురకలంటించారు. గతంలో టీడీపీకి 23 స్థానాలు వస్తే ఎద్దేవా చేశారనీ, కానీ తాము అలా చేయబోమని వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీస్సులతో తాను తొమ్మిది  దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచానని సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎంతోమంది నేతలను చూశానని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉన్నంత దుర్మార్గ నాయకులను ఏనాడూ చూడలేదన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని, తెలుగు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.