జవహర్‌రెడ్డి చీప్ సెక్రటరీ: సోమిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్‌రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్‌రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ (ఆదివారం) ’ఎక్స్‘లో పోస్టు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి ఏ సీఎస్ కూడా ఇలా దిగజారలేదని మండిపడ్డారు. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు.. చీప్ సెక్రటరీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్‌కు సీఎస్ గులాంగా మారి చట్టాలను బూటు కాళ్ల కింద నలిపేయడం దుర్మార్గమన్నారు. సీఎం దోచుకుంటున్న రూ.లక్షల కోట్లకు కౌంటింగ్ ఏజెంట్‌గా ఆయన మారిపోవడం విచారకరం అన్నారు. భూకుంభకోణం చేసిందీ, లేనిదీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుస్తుందని ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖను భూకుంభకోణాలకు అడ్డాగా మార్చేశారని సోమిరెడ్డి ధ్వజమెత్తారు.
మరోవైపు జవహర్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలోని వ్యవస్థలు కుప్పకూలిపోయాయన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు శానససభలో ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు విలువ లేకుండా చేశారని మండిపడ్డారు. వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్అండ్‌బీ, విద్య తదితర కీలక శాఖలకు కేటాయించిన నిధులను ఇష్టారాజ్యంగా మళ్లించే అధికారం మీకెవరిచ్చారని సోమిరెడ్డి ప్రశ్నించారు.