వికృతులను స‌రిచేసేది సంస్కృతే: రాష్ట్ర సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

వికృతులను స‌రిచేసేది సంస్కృతే: రాష్ట్ర సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

* భిన్నత్వంలో ఏక‌త్వ‌మే మ‌న దేశ గొప్ప‌ద‌నం
* తెలంగాణ సర్వ సంస్కృతుల ఖజానా ...సర్వ సంస్కృతుల నజారానా
* లోక్ మంథ‌న్ కు తెలంగాణ వేదిక కావ‌డం సంతోష‌దాయ‌కం

విశ్వంభ‌ర‌, హైద‌రాబాద్‌: సమాజంలో నేడు వ్యాప్తి చెందుతున్న వికృతులకు  సంస్కృతి, జీవన విధానం ధ్వంసం కావడమే మూల కారణమని తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సంస్కృతి అంటే ఓ జీవన విధానమని, కానీ.. అది నేడు ధ్వంసమైందన్నారు. అయితే... వీటిని సైన్స్ అస్సలు కాపాడలేదని, సంస్కృతే సమాజాన్ని కాపాడుతుందని స్పష్టం చేశారు. మనమందరమూ తిరిగి నైతిక విలువలను, సంస్కృతిని, సంప్రదాయాలను తిరిగి సంపాదించుకోవాలని పిలుపునిచ్చారు. హైద‌రాబాద్‌ వేదికగా నాలుగు రోజుల పాటు శిల్పారామంలో జర‌గ‌నున్న లోకమంథన్ -2024 ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పత‌న‌మని ,  దీనిని భావితరాలకు అందించాలన్నారు. దీనికి తగ్గట్టుగా లోకమంథన్ పనిచేస్తోందని ప్రశంసించారు. దేశంలో  ఆచార సంప్రదాయాలు, కళారూపాలు, యాస‌లు భిన్నంగా వున్నా... వీటన్నింటిలో ఉండే సూత్రం మాత్రం భారతీయ ఏకాత్మతా భావమని వివరించారు. తెలంగాణకు సుసంపన్న చరిత్ర, సంస్కృతి  ఉన్నాయ‌ని, ఇక్కడ‌ కళలు, శిల్పసంపదలు కూడా ఉన్నాయన్నారు. వీటన్నింటితో పాటు జైన, బౌద్ధ మతాలు కూడా విలసిల్లాయన్నారు. తెలంగాణ సర్వ సంస్కృతుల ఖజానా అని, సర్వ సంస్కృతుల నజారానా, ఉత్తర దక్షిణ సంస్కృతుల సంగమ స్థలం అని అభివర్ణించారు.
 
హైదరాబాద్ లో భిన్నత్వంలో ఏకత్వం వుంటుందని, అందరూ కలిసి జీవిస్తారని తెలిపారు. వివిధ ప్రాంతాల పర్వదినాలను కూడా ఇక్కడ నిర్వహిస్తామని తెలిపారు. ఇలా భారతీయ ఏకత్వ సూత్రాన్ని పంచడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మరోవైపు భరతనాట్యం, కూచిపూడి, పేరిణి, యక్షగానం, మోహినీ అట్టం లాంటి నాట్య కళలను కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.వీటితో పాటు జానపద, గిరిజన, శాస్త్రీయ సంగీతం, హైదరాబాద్ దక్కనీ కళారూపాలను కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా భారతీయ సంస్కృతి విశిష్టతను చాటి చెబుతున్నామని పేర్కొన్నారు. ఇంత మంది కళాకారులను, కళారూపాలను, వివిధ సంస్కృతులను, సంప్రదాయాలను ఒకచోట చేర్చి, లోక్ మంథన్ జరుగుతోందన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రం వేదిక కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని మంత్రి జూపల్లి తెలిపారు.

Tags: