భైంసాలో హై టెన్షన్… కేటీఆర్ పై దాడి చేసిన 26 మంది హనుమాన్ స్వాములు అరెస్ట్
విశ్వంభర, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భైంసాలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా హనుమాన్ మాల ధారులు దాడి చేసిన విషయం పాఠకులకు విదితమే. కేటీఆర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తూ జై తెలంగాణ అంటూ నినాదాలు ఇచ్చే సమయాన అవతల వైపు నుండి స్వాములు జైశ్రీరామ్ అంటూ నినాదాలు ఇవ్వగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
కొందరు ఉల్లిగడ్డలు, వంకాయలతో దాడి చేయగా.. రాముడు ఇలానే ఇతరులపై దాడి చేయమన్నాడా అంటూ కేటీఆర్ ప్రశ్నించాడు. దీంతో భైంసాలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ సంఘటనపై పోలీసులు వీడియో ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేటీఆర్ పై దాడి చేసిన 26 మంది హనుమాన్ దీక్షదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హిందూ సంఘాల నేతలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
దీంతో మరోసారి భైంసాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గతంలో కేటీఆర్ జై శ్రీరామ్ అనే మాట అన్నం పెడుతుందా..! అని అన్న వ్యాఖ్యలకు నిరసనగా హనుమాన్ స్వాములు జై శ్రీరాం నినాదానాలు చేస్తూ కేటీఆర్ రాకకి నిరసన తెలిపారు. అంతే కాకుండా హిందూవులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కొందరు కేటీఆర్ పై టమాటాలు, వంకాయాలతో దాడి చేశారు.