హైదరాబాద్ లో భారీ వర్షం
ఒక్కసారిగా మారిన వాతావరణం
రోడ్లపై నిలిచిపోయిన వాహనాలు
విశ్వంభర, హైదరాబాద్: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ రోజు పూర్తిగా రుతుపవనాలు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చాయి. దాంతో రాష్ట్రంలో పలు చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాజధాని హైదరాబాద్ లో ఒక్కసారిగా కుండపోత వర్షం మొదలైంది. నగరంలోని చాలా చోట్ల వర్షం బీభత్సం సృష్టించింది.
సాయంత్రం సమయంలో వర్షం పడటంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వారికి ఇబ్బందులు తప్పలేదు. అమీన్‌పూర్, కిష్టారెడ్డిపేట, కూకట్ పల్లి, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, నిజాంపేట తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. అటు వనస్థలిపురం, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, సరూర్ నగర్ లో భారీగానే వర్షం పడింది. సికింద్రాబాద్, హైదరాబాద్ వ్యాప్తంగా శుక్రవారం కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.