తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు పేరును ప్రస్తావించిన CM రేవంత్

తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు పేరును ప్రస్తావించిన CM రేవంత్

  • గురువులకు పంగనామం పెట్టే లక్షణం బీఆర్ఎస్ నాయకులదని విమర్శ
  • 20 ఏళ్ళు కలిసి పని చేసిన సహచరులను అగౌరవపరచడం సరికాదని వ్యాఖ్య
  • భోజనం పెట్టిన ఇంటికి నిప్పు పెట్టే రకమని ఆరోపణ
  • కమిషన్ ముందు వాదనలు వినిపించి కేసీఆర్ నిజాయతీని నిరూపించుకోవాలని సూచన
  • చంద్రబాబు హయాంలోనే 24 గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడి

హైద్రాబాద్, విశ్వంభర :-  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పేరును ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండుమూడుసార్లు ప్రస్తావించారు. విద్యుత్ కమిషన్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... గురువులకు పంగనామం పెట్టే లక్షణం బీఆర్ఎస్ నాయకులదని విమర్శించారు. మనం దాహంతో ఉన్నప్పుడు గ్లాస్ మంచినీరు ఇచ్చిన వారిని కూడా గుర్తు చేసుకోవడం మన తెలంగాణ వారి లక్షణమన్నారు. ఇరవై సంవత్సరాలు కలిసి పని చేసిన సహచరులను అగౌరవపరచడం సరికాదన్నారు. 

బీఆర్ఎస్ వారికి తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అలవాటేనని ఎద్దేవా చేశారు. తనకు మాత్రం అలాంటి గుణం లేదన్నారు. తాను మిత్రులు, సహచరులను బాగా చూస్తానని, పెద్దవారిని గౌరవిస్తానని, ఇది తనకు తన పెద్దలు నేర్పిన సంస్కారం అన్నారు. భోజనం పెట్టిన ఇల్లు, అవకాశం ఇచ్చిన వారి... ఇంటి వాసాలు లెక్కపెట్టడం, ఆ ఇంటికి నిప్పు పెట్టడం బీఆర్ఎస్‌కు అలవాటు అని ధ్వజమెత్తారు. అది వారి డీఎన్‌ఏలోనే ఉందన్నారు.

Read More స్త్రీ పురుష నిష్పత్తి సమానంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడికి ప్రతిరూపం అన్నట్లుగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారని, కానీ ఆయన విచారణ కమిషన్ ముందుకు వచ్చి వాదనలు వినిపిస్తే వారి నిజాయతీ బయటపడుతుందని తెలంగాణ సీఎం అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... విద్యుత్ అంశంలో న్యాయ విచారణ కోరిందే బీఆర్ఎస్ సభ్యులని అన్నారు. ఇప్పుడు వద్దని అంటోంది కూడా వాళ్లేనని విమర్శించారు.

జగదీశ్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి పవర్ ప్లాంట్‌పై న్యాయ విచారణ జరుగుతోందన్నారు. కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కావాలని డిమాండ్ చేశారు. విచారణ కమిషన్ కొత్త చైర్మన్‌ను సాయంత్రం నియమిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 24 గంటల విద్యుత్ ఇవ్వాలని చంద్రబాబు హయాంలోనే నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలియజేసారు . యూపీఏ ప్రభుత్వం నిర్ణయాల వల్ల హైదరాబాద్‌కు ఆదాయం పెరిగిందన్నారు.

 

 

 

 

 

Tags: