భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదు...రాజ్ నాథ్ సింగ్ క్లారిటీ
విశ్వంభర, ఢిల్లీ : భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదని, రిజర్వేషన్లను తొలగించదని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు బీజేపీ రిజర్వేషన్లను తొలగించడానికి ప్రయత్నాలు చేస్తుందని, రాజ్యాంగ ప్రవేశికను కాషాయ పార్టీ మార్చాలని చూస్తుందని ఇటీవల ఆరోపిస్తుండగా, దానికి సమాధానంగా రాజ్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ 1976లో, భారత రాజ్యాంగ పీఠికలో మార్పులు చేశారని, కానీ ఇప్పుడు అనవసరంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అబద్దాలు చెబుతున్నారని అన్నారు. అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని సవరణలు చేయచ్చు. కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు దీన్ని ఇలా చాలా సార్లు చేశారు. కానీ పీఠికలో మార్పులు చేసే ప్రసక్తి లేదు.
కాంగ్రెస్ మాత్రం మార్పులు చేసి ఇప్పుడు మాపై నిందలు వేయడానికి ప్రయత్నిస్తుంది, బీజేపీ దాని గురించి ఆలోచించడం లేదని మంత్రి తెలిపారు. బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని చింపి, పారేస్తుందని, పీఠిక నుంచి లౌకిక వాదం అనే పదాన్ని తొలగిస్తారని కాంగ్రెస్ నేత వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ ఈ విధంగా వివరించారు.