ఎంపీ వద్దిరాజు కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతిపత్రం సమర్పణ
ఢిల్లీ విశ్వంభర 24/07/2024 : - భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో ఖమ్మంకు చెందిన సీనియర్ న్యాయవాది తాళ్లూరి దిలీప్ చౌదరి ఆధ్వర్యాన న్యాయవాదులు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు
కొత్త నేర చట్టాలను సమీక్షించి స్వల్ప సవరణలు తీసుకు రావాలని, పెండింగ్ లో ఉన్న సెంట్రల్ నోటరీల నియామకాలను వెంటనే చేపట్టాలని,అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును అమలు జరపాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో ఖమ్మంకు చెందిన సీనియర్ న్యాయవాది తాళ్లూరి దిలీప్ చౌదరి ఆధ్వర్యాన బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది సంక్రాంతి రాజశేఖర్ తదితరులు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కు వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్ ఆవరణలోని ఛాంబర్ లో బుధవారం మధ్యాహ్నం వారు మంత్రిని కలిశారు.సెంట్రల్ నోటరీస్ నోటిఫికేషన్ 2021లో వేయగా 2000మంది న్యాయవాదులు దరఖాస్తు చేశారని, వాటిని వెంటనే పరిశీలించి నియామకాలు జరపాలని మంత్రికి వివరించారు. అదేవిధంగా అడ్వకేట్ ప్రొడెక్షన్ బిల్లు అమలునకు వెంటనే తగు చర్యలు తీసుకోవలసిందిగా మంత్రిని కోరారు.కొత్త నేర చట్టాలలో స్వల్ప సవరణల విషయమై జిల్లా జడ్జిలు,జిల్లా కోర్టుల ప్రాక్టీసింగ్ సీనియర్ న్యాయవాదుల సూచనలు స్వీకరిస్తే బాగుంటుందని, ఇందుకు గాను సదస్సులు, సమావేశాలు జరపాల్సిన అవసరం ఉందని ఎంపీ రవిచంద్ర, న్యాయవాదులు దిలీప్ చౌదరి, శ్రీనివాస్,రాజశేఖర్ లు మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కు వివరించారు.ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ తప్పకుండా పరిశీలిస్తానని హామీనిచ్చారు.