ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేతబడి : డీకే శివకుమార్

ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేతబడి : డీకే శివకుమార్

విశ్వంభర, కర్ణాటక : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి తనపై, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై చేతబడి చేస్తున్నారని ఆరోపించారు. కేరళలోని ఓ ఆలయంలో రాజకీయ ప్రత్యర్థులు ‘అఘోరాలు’, ‘తాంత్రికుల’ ద్వారా తాంత్రిక పూజలు చేస్తున్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, కేరళలోని రాజరాజేశ్వరి ఆలయానికి సమీపంలోని ఏకాంత ప్రదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతుబలితో కూడిన శత్రుభైరవి యాగం నిర్వహిస్తున్నట్లు తనకు విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు.


ఈ పూజలో పాల్గొన్న వారు దీని గురించి మాకు చెప్పారు. ఎవరెవరు దానిలో పాల్గొన్నారో మాకు తెలుసు, ఈ యాగం కోసం 21 ఎర్ర మేకలు, మూడు గేదెలు, 21 నల్ల గొర్రెలు, ఐదు పందులను బలి ఇస్తున్నట్లు తెలిసింది. రాజ కంటక, మారణ మోహనా స్తంభన యాగాలు చేసేందుకు వారు ప్రత్యేకంగా తాంత్రికులతో పూజలు చేస్తున్నారు. ఈ యాగాలు ఎవరు చేస్తున్నారో కూడా మాకు తెలుసు, వారు ఇందులో నిష్ణాతులు, వారు చేయాలనుకున్నది చేయనివ్వండి, వాళ్ళు చేతబడి పూజలు చేసిన మేము నమ్మే శక్తి మమ్మల్ని రక్షిస్తుంది. నిమ్మకాయ నిపుణులకు భయపడనని, తాను నమ్మినబంటునని, ప్రజల ఆశీస్సులే తనను, సిద్ధరామయ్యను కాపాడతాయని శివకుమార్ అన్నారు.

Read More సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలి:  చిలుక మధుర ఉపేందర్ రెడ్డి


విలేకరుల సమావేశంలో బీజేపీ లేదా జేడీఎస్ నాయకులు ఈ పూజలు చేస్తున్నారా అని ప్రశ్నించినప్పుడు కర్ణాటకకు చెందిన రాజకీయ నాయకులే దీనికి కారణమని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జూన్ 2న బెంగళూరులో శాసన సభ్యుల సమావేశం ఉంటుందని ప్రకటించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ దీనికి ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నట్లు తెలిపారు.