స్కూటీపై రీల్స్ చేస్తూ డీసీఎంను ఢీ కొట్టారు.. ఇద్దరు బాలుర మృతి
రీల్స్ మోజు ఇద్దరి ప్రాణాలు తీశాయి. ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వారి దాకా అందరూ రీల్స్ చేయడానికి తెగ మోజు పడుతున్నారు. ఇక ఇప్పటి జనరేషన్ పిల్లలు అయితే మరీ ఎక్కువగా ఇవే చేస్తున్నారు. కొన్ని సార్లు ఆ రీల్స్ ప్రాణాలు తీస్తున్నా సరే అస్సలు ఆపట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో మరో ఇద్దరి బాలుర ప్రాణాలు ఇలాగే గాల్లో కలిసిపోయాయి.
వనివారం రాత్రి ఓ ముగ్గురు బాలురు స్కూటీపై వెళ్తూ రీల్స్ చేస్తున్నారు. ఇంతలో డీసీఎం ను ఢీ కొనగా అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి సీరియస్ గా ఉంది. సూరారానికి చెందిన ఉదయ్(17), సాయిబాబానగర్ కు చెందిన శివదీక్షిత్(17), మల్లారెడ్డినగర్ కు చెందిన మరో బాలుడు శనివారం నాడు రాత్రి మాదాపూర్ కేబుల్ బ్రిడ్జికి బయలు దేరారు.
అయితే వారు ముగ్గురూ స్కూటీపై వెళ్తూనే రీల్స్ చేస్తూ వచ్చారు. కూకట్ పల్లి వై జంక్షన్ వద్దకు రాగానే.. రోడ్డు మీద ఆగి ఉన్న డీసీఎంను స్పీడ్ గా ఢీ కొట్టారు. దాంతో ఉదయ్, శివదీక్షిత్ అక్కడికక్కడే మరణించారు. ఇంకో బాలుడు ప్రస్తుతం సీరియస్ గా ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.