వివాహ వేడుకలో విషాదం.. డీజే వాహనం ఢీకొని ముగ్గురు మృతి
ఓ వివాహ వేడుకలో విషాదం మిగిలింది. డీజే వాహనం ఢీకొని ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది.
ఓ వివాహ వేడుకలో విషాదం మిగిలింది. డీజే వాహనం ఢీకొని ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే వ్యక్తి రాత్రి 10గంటల తర్వాత పాటలు ప్లే చేయడం మానేశాడు.
దీంతో అతడికి పెళ్లికి వచ్చిన బంధువుల మధ్య గొడవ చెలరేగింది. పాటలు పెట్టాల్సిందేనని బంధువులు వాదించగా డీజే ఆపరేటర్ మాత్రం సమయం అయిపోయిందని వారితో చెప్పాడు. ఈ క్రమంలో అక్కడి నుంచి వెళ్లేందుకు డ్రైవర్ వాహనాన్ని వెనక్కి తిప్పడం ప్రారంభించాడు. దీంతో అడ్డగించబోయిన ఓ బాలిక, ఇద్దరు మహిళలు డీజే వాహనం చక్రాల కింద పడిపోయారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా రమరతి (55) అనే మహిళ, రేష్మ (17), శాంత (30) చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన అనంతరం స్థానికులు ఆగ్రహంతో డీజే వాహనానికి నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నామని బేతుల్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ కమలా జోషి వెల్లడించారు.