రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెయిల్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో హేమకు ఊరట లభించింది.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో హేమకు ఊరట లభించింది. బెంగళూరు స్పెషల్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా హేమ పరప్పన అగ్రహార జైల్లో ఉంది. బెయిల్ లభించిన నేపథ్యంలో ఆమె జైలు నుంచి బయటికి రానుంది.
బెంగళూరు పోలీసులు మరికొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలను ఈ పార్టీకి తరలించే ప్రయత్నం చేసినట్లు ధ్రువీకరించారు. దీంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా పంపించారు. తొలిసారి జారీ చేసిన నోటీసులకు అనారోగ్య కారణాలతో హేమ విచారణకు హాజరు కాలేదు. దీంతో రెండోసారి కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అప్పుడు బుర్ఖా ధరించి విచారణకు హాజరైంది హేమ. ఆ తర్వాత కోర్టు ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా హేమ సభ్యత్వాన్ని రద్దు చేసింది. తాజాగా హేమకు బెయిల్ మంజూరు కావడంతో హేమకు కాస్త ఊరట లభించినట్లైంది. ఇవాళ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హేమ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. హేమ నుంచి ఎలాంటి మాదకద్రవ్యాలు లభించలేదని, చాలా రోజుల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించామని హేమ తరఫు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించారు. దీంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది.