నువ్వు గేమ్ ఛేంజర్వి పవన్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
- తమ్ముడి గురించి చిరు స్పెషల్ పోస్ట్
- పవన్ విజయం తర్వాత ఎమోషనల్ ట్వీట్
- చంద్రబాబుకు ప్రత్యేక విషెస్
విశ్వంభర, హైదరాబాద్ : ఏపీలో కూటమి విజయం సాధించిన సందర్భంగా ప్రముఖులు స్పందిస్తున్నారు. కూటమికి అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ ఏశారు. డియర్ కళ్యాణ్ బాబు.. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు గేమ్ ఛేంజర్వి మాత్రమే కాదు, మ్యాన్ అఫ్ ది మ్యాచ్ వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వు ఏర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు చిరంజీవి.
చంద్రబాబుకు విషెస్..
ఏపీలో కూటమి విజయం సాధించడంతో చంద్రబాబుకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు చిరంజీవి. ఈ క్రమంలో ఎక్స్ లో ఇలా రాసుకొచ్చారు చిరంజీవి. ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చారు చిరంజీవి.