పెళ్లిచూపులకు వస్తుండగా ప్రమాదం.. యువకుడు మృతి..!
తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో ఆ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
పెళ్లిచూపులకు వస్తుండగా ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో ఆ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆర్.మల్లవరం గ్రామానికి చెందిన పాలకుర్తి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు సందీప్ (31) ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కొంతకాలం అమెరికాలోనూ ఉద్యోగం చేశాడు. అయితే విదేశాల్లో ఉద్యోగం చేయడం ఇష్టంలేక తల్లిదండ్రులతో ఉంటూనే జాబ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అమెరికా నుంచి బెంగళూరుకు వచ్చి ఇక్కడే జాబ్ చూసుకున్నాడు. ఈ క్రమంలో సందీప్‌కు ఒక పెళ్లి సంబంధం వచ్చింది.
పెళ్లిచూపులు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్పడంతో బెంగళూరు నుంచి స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో ఐతేపల్లి సమీపంలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై శనివారం వేకువజామున సందీప్ ప్రయాణిస్తున్న కారు.. ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.