రూ. 200 కోట్లు స్వాహా.. బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ కంపెనీ
హైదరాబాద్‌లో రోజుకో ఘరానా మోసం బయటకు వస్తుంది. రాత్రి పగలు కష్టపడి, చెమడోడ్చి సంపాదించిన సొమ్ము అంతా చాలా మంది దోపీడీ దారుల చేతులో పెడుతున్నారు. తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామని నమ్మించి ఏకంగా రూ.80 కోట్లు దోచేసిన ఘటన నిన్న వెలుగులోకి వచ్చింది. ఎక్కువ వడ్డీ రేట్ల పేరుతో రూ.200 స్వాహ చేసిన ఘటన ఇవాళ బయటపడింది.
దాచి.. దాచి దెయ్యాల పాలు చేసినట్టు.. సామాన్యులు చాలా మంది ప్రైవేట్ కంపెనీల మాయలో పడుతున్నారు. తమ దగ్గర పెట్టుబడి పెడితే అధిక వడ్డీలు చెల్లిస్తామని
అబిడ్స్‌లోని శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఉన్న ఓ సంస్థ నమ్మబలికింది. ఈ మాటలు నమ్మిన సామాన్యులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అధిక వడ్డీలకు ఆశపడి ఏకంగా రూ.200 కోట్లు ఆ కంపెనీ చేతిలో పెట్టారు.
పెట్టుబడుల దారులను ఆకర్షించడానికి ఆ కంపెనీ ఏజెంట్లను కూడా నియమించింది. ఏజెంట్లతో పెద్ద వ్యవస్థ ఉండటంతో ప్రజలు ఈజీగా నమ్మేశారు. రూ. 200 కోట్లు వసూలు అయిన తర్వాత రాత్రికి రాత్రే ఆ కంపెనీ ప్రతినిధులు బోర్డు తిప్పేశారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు బషీర్‌బాగ్ సీసీఎస్ పీఎస్‌లో ఫిర్యాదు చేసి అక్కడే ఆందోళన చేపట్టారు. దాదాపు 517 మంది శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో పెట్టుబుడులు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు.