అలర్ట్.. సూర్యాపేట ఎస్పీ పేరుతో నకిలీ ఖాతా
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు ఆపు లేకుండా పోతుంది. సెలబ్రిటీలు, అధికారులు, ప్రభుత్వ పెద్దల సోషల్ మీడియా అకౌంట్స్ కూడా హ్యాక్ చేస్తున్నారు. కొంతమంది వారి పేరుతో నకిలీ ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. ఆ తర్వాత డబ్బులు కావాలని మెసెజ్‌లు చేస్తున్నారు.
కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్లు పోలీసు, ఐఏఎస్ అధికారులు, రాజకీయ నేతల సోషల్ మీడియా అకౌంట్లతో ఫేక్ ఖాతాలు క్రియేట్ చేసి వారిలా చాట్ చేసి అమాయకులకు వల వేస్తున్నారు. ఆ తర్వాత వారి నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఇటీవలే తెలంగాణ డీజీపీ రవిగుప్తా పేరుతో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేశారు. ఇదో సంచలనం అయింది.
ఇప్పుడు సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే వంతు వచ్చింది. రవిగుప్త పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా క్రియేట్ చేశారు సైబర్ కేటుగాళ్లు. ఎస్పీ సూర్యాపేట అనే అకౌంట్ క్రియేట్ చేసి.. ఈ నకిలీ ఖాతా నుంచి మెసేజ్‌లు, ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారు. ఇది రాహుల్ హెగ్డే దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన సూర్యాపేట అకౌంట్ నుంచి మెజేజ్ లు వస్తే ఎవరూ స్పందించవద్దని తెలిపారు. ఎవరూ డబ్బులు పంపవద్దని సూచించారు. నకిలీ ఖాతాలు క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.