‘వారం రోజులు బెయిల్ పొడిగించండి..’ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్
ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసు వీడటంలేదు. ఈ క్రమంలో ఆయన పలు ఆరోగ్య కారణాలను చూపుతూ బెయిల్ పొడిగింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసు వీడటంలేదు. ఈ క్రమంలో ఆయన పలు ఆరోగ్య కారణాలను చూపుతూ బెయిల్ పొడిగింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్ 1 వరకు సుప్రీం కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్ 2 న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.
తన తీవ్ర ఆరోగ్య సమస్యలను వివరిస్తూ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్ మంజూరు చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న కేజ్రీవాల్ కు ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాయని, మరి కొన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వైద్య బృందం తెలిపింది.
సీఎం ఆరోగ్యానికి కీలకమైన వైద్య పరీక్షలు పూర్తి చేసేందుకు మరో ఏడు రోజులు బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది సుప్రీం కోర్టును అభ్యర్థించారు. మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి విదితమే. అరెస్టు తర్వాత ఆయన 7కిలోలు తగ్గారని ఆప్ పేర్కొంది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల నిమిత్తం మరో ఏడు రోజులు బెయిల్‌ను పొడిగించాలని కేజ్రీవాల్ కోరినట్లు తెలుస్తోంది.