ఈ నెల 23 నుండి శ్రీ గట్టు మైసమ్మ జాతర

ఈ నెల 23 నుండి శ్రీ గట్టు మైసమ్మ జాతర

  • ముస్తాబైన గట్టు మైసమ్మ ఆలయం
  • 25 వరకు ఘనంగా నిర్వహించనున్న ఉత్సవాలు
  • ఈ నెల 23వ తేదీ నుండి 25 తేదీ వరకు జాతర

విశ్వంభర, చింతపల్లి : మండల కేంద్రంలో నాగార్జునసాగర్ హైదరాబాద్ హైవేపై వెలసిన శ్రీ గట్టు లక్ష్మీ మైసమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేం దుకు నిర్వాహకులు ఆలయాన్ని ముస్తాబు చేస్తు న్నారు. చింతపల్లి మండల కేంద్రంలోని గట్టుపతి  వెంకటేశ్వర స్వామి ఆలయానికి అతి సమీపంలో శ్రీ గట్టు లక్ష్మీ మైసమ్మ మాత ఆలయాన్ని సుమారు 30 ఏళ్ల క్రితం గండికోట మల్లయ్య గుడి పీఠాధిపతి నిర్మించారు. అంతకుముందు ఇక్కడ చిన్న గుడి మాత్రమే ఉండేది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారి ఆలయం భక్తులు ఇచ్చిన విరాళాలతో అమ్మవారి విగ్రహాన్ని పదేళ్ల క్రితం ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం పూర్తిస్థాయిలో ఇంకా జరగాల్సి ఉంది. ఈ దేవాలయం రాష్ట్ర రహదారి పక్కనే ఉండడంతో మండల ప్రజలే కాక ఇతర మండలాల ప్రజలు ఎంతో నమ్మకంతో అమ్మవారిని కొలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే నాగుల పుట్ట ఉండటంతో మహిళలు నిత్యం ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.
శ్రీ గట్టు మైసమ్మ మాతను నమ్మిన భక్తులను చల్లగా చూసే చల్లని తల్లి, కరుణించి కాపాడే ముగ్గురమ్మ మూళ్లపుటమ్మ శ్రీ గట్టు లక్ష్మీ మైసమ్మ జాతర ఉత్సవాలు 23 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జాతర ప్రారంభం, అమ్మవారి పూజ, సోమవారం బోనాలు, పలహారపు బండ్లు, వనవాసం, అన్నదానం, మంగళవారం అమ్మవారి జాతర ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. జాతర ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఆలయ నిర్మాణం, ఉత్సవాలను భక్తుల విరాళాలతో ఏటా ఘనంగా నిర్వహించుకోవడం విశేషం. ఉత్సవాల సందర్భంగా భజనలు, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ పీఠాధిపతులు గండికోట చంద్రశేఖర్, గండికోట దేవదాస్ లు తెలిపారు.

Tags: