తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు తక్షణ అమలు – రాహుల్ గాంధీ జోక్యం అవసరం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు బహిరంగ లేఖ

తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు తక్షణ అమలు – రాహుల్ గాంధీ జోక్యం అవసరం

విశ్వంభర, న్యూఢిల్లీ : తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను ఏఐసీసీ  కార్యాలయం, రాహుల్ గాంధీ కార్యాలయానికి పంపించారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అనంతరం న్యూఢిల్లీ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
 
బీసీ రిజర్వేషన్ల అమలుకు చట్టబద్ధత – సుప్రీంకోర్టు తీర్పుల ఆధారం
 
ఇంద్రా సహానీ కేసులో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ల పరిమితిని సూచించినప్పటికీ, ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పరిమితిని మించవచ్చని పేర్కొంది.
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణనలో బీసీల జనాభా 56.33% గా నిర్ధారించబడింది. ఈ గణాంకాలు, గత న్యాయ నిర్ణయాలు, మరియు గవర్నర్ ఆమోదించిన బీసీ బిల్లులను రాష్ట్ర చట్టంగా అమలు చేయడం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వానికి 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి పూర్తి అధికారాలు ఉన్నాయి.
 
కేంద్ర ప్రభుత్వంతో కూడా మిగతా అంశాలపై సమాంతరంగా కృషిని కొనసాగించాలి. న్యాయపరమైన సమస్యలు ఎదురైతే, వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. అందువల్లనే ప్రామాణిక అధ్యయనం ఆధారంగా ఈ సమస్యలను అధిగమించవచ్చు.
 
రాహుల్ గాంధీ కీలక పాత్ర అవసరం – రేవంత్ రెడ్డికి మార్గదర్శనం ఇవ్వాలి
 
తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించినప్పటికీ, ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని డా. వకుళాభరణం గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా ముందుకు వెళ్లేందుకు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తక్షణ మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
 
తెలంగాణ ఆదర్శంగా నిలవాలి – పార్లమెంటు ఆమోదంతో 9వ షెడ్యూల్‌లో చేర్చాలి
 
తెలంగాణ 42% బీసీ రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో అమలు చేసి దేశానికి మార్గదర్శకంగా నిలవాలని, ఆపై పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేసి రాజ్యాంగం 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కృషి చేయాలని డా. వకుళాభరణం సూచించారు. ప్రధానమంత్రి కూడా ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కోరారు.
WhatsApp Image 2025-03-27 at 1.53.27 PM
చట్టపరమైన & న్యాయపరమైన ఆధారాలు
 
✔ రాజ్యాంగ అనుమతులు:
• ఆర్టికల్స్ 243D(6) & 243T(6) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.
✔ సుప్రీంకోర్టు తీర్పులు:
• ఇంద్రా సాహ్ని కేసు (1992): 50% పరిమితిని దాటి రిజర్వేషన్లు ఇవ్వొచ్చని తీర్పు.
• I.R. Coelho కేసు (2007): 9వ షెడ్యూల్ చట్టాలు రాజ్యాంగ మౌలికత కు భంగం కలిగించకూడదని స్పష్టం.
✔ తెలంగాణ కుల గణన నివేదిక: బీసీ జనాభా 56.33% గా నిర్ధారణ.
✔ నిపుణుల కమిటీ నివేదికలు: (ఆనివార్యం, పూర్తిస్థాయిలో సిఫార్సులు అవసరం)
• Retd. IAS బూసాని వెంకటేశ్వర్లు కమిటీ
• న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి కమిటీ
• తెలంగాణ బీసీ కమిషన్ నివేదిక
 
కమిషన్లు & కమిటీ నివేదికలను అధికారికంగా స్వీకరించి అమలు చేయాలి
 
42% బీసీ రిజర్వేషన్లకు బలమైన ఆధారాలను సమర్పించేందుకు, పై రెండు కమిషన్లు మరియు ఒక కమిటీ నివేదికలను అధికారికంగా స్వీకరించి, వాటిని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి.
 
ఈ నివేదికలు బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై ప్రామాణికమైన అధ్యయనాన్ని అందిస్తాయి. ఇవి తుది నిర్ణయానికి అత్యంత కీలకం. ఈ నివేదికలు, వీటి సిఫార్సులు లేకుండా 42% బీసీ రిజర్వేషన్ల అమలు బలహీనపడే అవకాశం ఉంది.
 
కాబట్టి, ఈ నివేదికలను అధికారికంగా ఆమోదించి, వాటి ఆధారంగా ప్రభుత్వం న్యాయపరమైన, గణాంకపూర్వక, పరిమాణాత్మక అధ్యయనాన్ని చేపట్టి అమలు చేయాలి. ప్రభుత్వం ఈ కమిటీల నివేదికలను పూర్తిగా స్వీకరించి, అమలు చేయాలని డా. వకుళాభరణం కోరారు.
 
రాహుల్ గాంధీకి విజ్ఞప్తి
 
రాహుల్ గాంధీ 42% బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన సలహాలు అందించాలని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, కేవలం కేంద్ర ప్రభుత్వంపై నెపం వేసి సరిపెట్టుకోవడం కాకుండా, స్పష్టమైన రాజకీయ ఆచరణతో రిజర్వేషన్ల అమలు జరిగేలా చూడాలని డా. వకుళాభరణం విజ్ఞప్తి చేశారు. అప్పుడే తెలంగాణ మరియు దేశంలోని బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచుతాయి అని ఆయన గమనించారని పేర్కొన్నారు.WhatsApp Image 2025-03-27 at 1.53.26 PM
 
 
 
 
 
 
 

Tags: