కేరళను తాకనున్న రుతుపవనాలు.. రైతులకు చల్లటి కబురు
ఈ నెల చెదురుమదురు వర్షాలు పడినా.. ఎండ తీవ్రత మాత్రం విపరీతంగా ఉంది. గతంలో కంటే వడగాలులు, ఉక్కపోత ఎక్కువగా ఉన్నాయి. అయితే.. ఇకపై ఈ ఇబ్బందికర పరిస్థితితులు తప్పనున్నాయి. వాతవరణ శాఖ రైతులు, ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవానాలు ఇవాళే కేరళ తీరాన్ని తాకనున్నాయి.
వాతావరణం చల్లబడడం, గాలులు వీస్తుండడం, కేరళ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతుండటంతో రుతుపవనాల రాకకు మార్గం సుగమం అయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కేరళను నైరుతి తాకిన నాలుగు ఐదు రోజుల్లోనే ఆంధ్రా, తెలంగాణకు కూడా విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు చెప్పారు. నైరుతి రాకతో మొదట దక్షిణాది రాష్ట్రాలు చల్లబడతాయి.
మే 31 నాటికి కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని వాతావరణ కేంద్రం మే 15న ప్రకటించింది. కానీ.. రేమాల్ తుఫాన్ కారణంగా ఓ రోజు ముందుగానే వస్తున్నాయి. అంటే ఇవాళ సాయంత్రానికే రుతుపవానాలు తీరాన్ని తాకుతాయి.
గతేడాది రుతుపవనాలు అంచనా వేసిన సమయానికంటే ఆలస్యంగా వచ్చాయి. కానీ.. ఈ సారి మాత్రం ఓరోజు ముందుగానే వస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు వేగంగా కదిలితే.. అంతే వేగంగా దేశం మొత్తం రుతుపవనాలు వ్యాపిస్తాయి. ఇక దేశంలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది ఐఎండీ.