బక్రీద్ సందర్భంగా భారీగా పెట్రోల్ ధర తగ్గింపు

బక్రీద్ సందర్భంగా భారీగా పెట్రోల్ ధర తగ్గింపు

  • లీటరు పెట్రోల్‌కు రూ.10.20, డీజిల్‌కు  రూ.2.33 తగ్గింపు
  • నోటిఫికేషన్ జారీ చేసిన పాక్ ప్రభుత్వం 
  • ఆర్థిక సంక్షోభంలో పాక్ ప్రజలకు కాస్త ఊరట

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో బక్రీద్ పండుగ సందర్భంగా కాస్త ఊరట లభించింది. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ లీటరుకు రూ.10.20 చొప్పున, డీజిల్ లీటరుకు రూ.2.33 వంతున తగ్గించింది. పాక్‌లో నగదు కొరత, రెండంకెల ద్రవ్యోల్బణంతో ధరలు భారీగా పెరిగి ప్రజలు సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో బక్రీద్ పండుగకు ఈ ధరల తగ్గింపు కాస్త ఊరటనిచ్చింది.

సాధారణంగా ప్రతీ పదిహేను రోజులకోసారి దేశంలో ఇంధన ధరల సమీక్ష ఉంటుంది. అయితే, ఈసారి ధరలు తగ్గించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు, వినియోగదారుల ధరల సూచీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో ప్రకటించింది. 2022 మే నెల నుంచి పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

చివరికి పిండి, తిండిగింజలూ దొరక్క ఆహారధాన్యాల కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ దేశ ప్రజలకు తొలిసారిగా దక్కిన భారీ ఉపశమనం ఇదే కావడం గమనార్హం. ఇంధన ధరల తగ్గుముఖంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా కొంచెం తగ్గుముఖంపడుతాయని పాక్ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంధన ధరల తగ్గింపు నిర్ణయానికి ముందు దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ ప్రకటనలో పరిశ్రమలకు విద్యుత్ బిల్లులను భారీ స్థాయిలో తగ్గిస్తున్నట్లు తెలిపారు. యూనిట్‌కు రూ 10.69 పైసలు చొప్పున ఈ తగ్గింపు అమలులోకి వచ్చినట్లు వెల్లడించారు.

Related Posts