పదే పదే ఫోన్ చూస్తున్నారా.. ఈ సమస్యలు వస్తాయ్ జాగ్రత్త..
పదే పదే ఫోన్లు చూడటం ఈ జనరేషన్ లో అందరికీ బాగా అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. దాంతో చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వయసు వారి దాకా అందరూ స్మార్ట్ ఫోన్లను గంటల కొద్దీ చూస్తున్నారు. అయితే ఇలా రోజంతా ఫోన్లు చూడటం వల్ల కంటికి చాలా సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రోజంతా ఫోన్లు చూడటం వల్ల కంటి అలసట ఎక్కువగా వస్తుంది. దాంతో తలనొప్పి, దృష్టి లోపంతో పాటు మెడ, భుజాలలో నొప్పులు కూడా వస్తాయని చెబుతున్నారు. ఇక మరికొంత మందిలో నీలం కాంతి ప్రభావం ఉంటుంది. అంటే ఫోన్ స్క్రీన్ నుంచి బ్లూ లైట్ వెలువడుతుంది. దీని వల్ల నిద్ర రాదు. నిద్ర వచ్చే హార్మోన్లను ఇది దెబ్బ తీస్తుంది.
దాంతో పాటు కండ్లు పొడిగా మారిపోతుంటాయి. ఎందుకంటే మనం ఫోన్ స్క్రీన్ వైపు చూసేటప్పుడు తక్కువ సార్లు రెప్పలు కొడతాం.. దీని వల్ల కళ్లు పొడిబారిపోతాయి. దాంతో కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో కంటికి సంబంధించిన ఇతర వ్యాధులు కూడా రావచ్చు. ఇక కంటి శుక్లం వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు డాక్టర్లు. ఎక్కువ సేపు దృష్టి ని ఫోన్ల మీద కేంద్రీకరించడం వల్ల కంటి ఆకారాన్ని మార్చవచ్చు. ఇది కంటిశుక్లాలకు దారితీస్తుంది. కాబట్టి గంటల కొద్దీ ఫోన్లు చూడకపోవడం మంచిది.