రెడ్ బుక్ అంటే ఉలికిపాటు ఎందుకు జగన్? - జగన్ కు దమ్ముంటే .. శాసనసభకు వచ్చి వాస్తవాలను ప్రకటించాలి
తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
అసెంబ్లీకి రాకుండా శ్వేత పత్రాలపై ఎక్కడో మాట్లాడితే ఏమి ఉపయోగం
ప్రజల హక్కులకు భంగం కలిగించిన వారి పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో ఉన్నాయి
ప్రజలకు ఇబ్బందులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవు
తప్పు చేసేవాళ్ళు భయపడాలి గాని జగన్ అండ్ కో ఎందుకు భయపడుతున్నారో చెప్పాలి
అనకాపల్లి, విశ్వంభర:- పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న విధంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీరు ఉందని.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఎద్దేవా చేశారు. శనివారం.. అనకాపల్లిలోని దాడి వీరభద్ర రావు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బి.వి.రామ్ మాట్లాడారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్.. రెడ్ బుక్ అంటూ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే ప్రజల హక్కులకు భంగం కలిగించారో అటువంటి వారి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయన్నారు. తప్పులు చేసిన వారికి, ప్రజల హక్కులకు భంగం కలిగించిన వారికి ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్ష పడుతుంది అని.. మంత్రి నారా లోకేష్ అనేకసార్లు చెప్పారన్నారు. మరో వైపు తామేదో తప్పు చేసినట్టుగా.. తమ పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయన్నట్టుగా అటు జగన్మోహన్ రెడ్డి గాని, ఇటు 'కోడిగుడ్ల' శాఖ మాజీ మంత్రి అమర్ తదితరులు గాని ఎందుకు వణికి పోతున్నారని రామ్ ప్రశ్నించారు. ఒకవేళ ఏ తప్పు చేయకపోతే జగన్ అండ్ కో ఎందుకు భయపడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
ఢిల్లీకి వెళ్లి ఏం సాధించావు జగన్..?
దేశ రాజధాని లో రాష్ట్రం పరువు తీయడం తప్ప వైయస్ జగన్ చేసింది ఏమీ లేదని రామ్ అన్నారు. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, హోమ్ మంత్రిని కలుస్తామని ప్రగల్బాలు పలికిన జగన్ చివరకు ఫోటో ఎగ్జిబిషన్ పేరుతో మమ అనిపించారన్నారు. జగన్ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కు పార్లమెంట్లో ప్రధాన ప్రతి పక్షమైన కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో లేని సమాజ్ వాదీ పార్టీ తరఫునుంచి, శివసేన నుంచి మొక్కుబడిగా..తప్పదు అన్నట్టుగా, అది కూడా అనేకసార్లు బతిమాలించుకున్న తర్వాత.. ఒక్కొక్కరు హాజరయ్యారన్నారు. దేశ రాజధాని లో జగన్ స్థాయి ఆ విధంగా 'వెలిగి' పోతోందన్నారు. పోనీ ఆ 36 మంది వివరాలకు చెప్పావా అంటే.. అది కూడా లేదన్నారు. నిజంగా జగన్ కు చిత్త శుద్ధి ఉంటే ప్రాణాలు కోల్పోయారని చెబుతున్న ఆ 36 బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇదిలా ఉండగా అసెంబ్లీకి రాకుండా శ్వేత పత్రాలపై ఎక్కడో మాట్లాడితే ఉపయోగం ఏముంటుందని.. అందుకే అసెంబ్లీకి వచ్చి సమాధానం చెబితే ప్రజలందరూ జగన్ చెప్పే మాటలను విశ్వసిస్తారన్నారు. నిజంగా జగన్ కు దమ్ముంటే .. శాసనసభకు వచ్చి వాస్తవాలను .. ప్రకటించాలన్నారు.
వికలాంగ పింఛన్లపై విచారణ జరిపించాలి
వికలాంగుల పింఛన్ల పేరుతో వైసిపి ప్రభుత్వం లో అనేక అక్రమాలు జరిగాయని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆరోపించారు. వైకల్యం ఉందంటూ అనేక మంది వైసీపీ నాయకులు తమకు నచ్చిన వారికి వికలాంగ పింఛన్లు మంజూరయ్యే విధంగా వైద్యులతో తప్పుడు సర్టిఫికెట్లను ఇప్పించారన్నారు. ఈ నేపథ్యంలోనే వికలాంగ పెంఛన్ల ను తాత్కాలికంగా నిలిపివేసి.. పూర్తిస్థాయి విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒక వేళ సంబంధిత వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్లు తప్పు అని తెలితే ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం 3000 రూపాయల నుంచి 6000 రూపాయలు పెంచింది కాబట్టి అదేవిధంగా సదరు వైద్యుడిపై మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయాలన్నారు. ఏది ఏమైనప్పటికీ నిజమైన వికలాంగులకు న్యాయం చేయడమే తమ ప్రధాన ఉద్దేశం అన్నారు.